Sun Nov 24 2024 06:35:02 GMT+0000 (Coordinated Universal Time)
Andhra, Telangana : చంద్రబాబు, రేవంత్‌ల సమావేశం తర్వాత పురోగతి ఏదీ? ఏదో జరగరానిది జరిగినట్లుందే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరి సమావేశం జరిగి నెల రోజులవుతోంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వీరి సమావేశం జరిగి నెల రోజులు దాటుతోంది. జులై 6వ తేదీన ప్రజాభవన్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. ఉన్నతాధికారులు, మంత్రులు హాజరై కొంత హడావిడి అయితే జనంలో తేగలిగారు. రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూసేందుకే సమావేశమయ్యాని ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పుకొచ్చారు. జులై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి దాదాపు తొమ్మిది గంటల వరకూ అంటే మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తర్వాత మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు.
అధికారులతో కమిటీ...
ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఇరు రాష్ట్రాల మంత్రులు మాట్లాడుతూ సామరస్యంగా ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. అనేక విభజన చట్టంలో ఉన్న అంశాలు రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని, సాధ్యం కాని వాటిని ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు కోరతామన్నారు. అయితే ఇందుకు ఆరోజు జరిగిన సమావేశం తర్వాత పది రోజుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సమావేశమయి, అందులో పరిష్కారం కాని సమస్యలను ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుందని తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమవుతారని చెప్పారు.
నెలరోజులు గడిచినా...
వినసొంపుగా ఉన్న ఈ మాటలు నిజమేనని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నమ్మారు. కానీ జులై 6వ తేదీన సమావేశం జరిగితే ఈరోజు ఆగస్టు 11 వతేదీ. అంటే నెల రోజులు గడిచిపోయినా ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కాలేదు. అసలు రెండు రాష్ట్రాల్లో ఆ ఊసే నేతలు ఎత్తడం లేదు. అసలు సమస్య పరిష్కారం దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సమావేశం జరిగిందా? లేక సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారా? అన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం? సమావేశం జరిగిన తర్వాత ఏం జరిగిందన్న దానిపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇంతకూ అధికారుల కమిటీ ఎప్పుడు సమావేశం అవుతుందో ఎవరైనా చెప్పగలరా?
Next Story