Thu Nov 28 2024 22:32:00 GMT+0000 (Coordinated Universal Time)
సోము దెబ్బకు.. ఆ ముగ్గురు కోవర్టులు అవుట్
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలకు బయటకు పంపాలనే చూస్తుంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలకు బయటకు పంపాలనే చూస్తుంది. ఎన్నికల ముందే వీరిని వదిలించుకోవాలని చూస్తుంది. పార్టీలో ఉంటూ కోవర్టులుగా ఉన్న వీరిని వీలయినంత త్వరగా పార్టీ నుంచి బయటకు పంపడమే మేలని భావిస్తుంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తి కావడంతో వీరి వ్యవహారాన్ని అధినాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
విష్ణుకు నోటీసులు...
ఇటీవల ఒక న్యూస్ ఛానల్లో విశాఖ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రస్తావన, బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని మోదీకి తాను చెప్పానని చెప్పడం వంటి కారణాలపై ఆయన సంజాయిషీని కోరింది. అయితే తాను గతంలో మోదీకి ఒంటరిగా వెళితే బీజేపీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని లేఖ రాశానని విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర నాయకత్వమే చర్యలు తీసుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలోనే విష్ణుకుమార్ రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.
టీజీ ఫొటోతో...
ఇక మరో కీలక నేతకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌కు ఈ నోటీసులు జారీ చేసింది. నారా లోకేష్ కర్నూలు నగరంలో పాదయాత్ర చేస్తుండగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీజీ వెంకటేష్ ఫొటో ఉండటంపై వివరణ కోరింది. టీజీ వెంకటేష్ బీజేపీలో ఉండగా, ఆయన కుమారుడు టీజీ భరత్ మాత్రం కర్నూలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే బీజేపీలో ఉంటూ టీడీపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తుండటంతో ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
ఆదిపై కూడా...
ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఒకే కుటుంబంలో ఉండేవారు ఒకే పార్టీలో ఉండేలా తీర్మానం చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. అలా తీర్మానం చేస్తే ఉన్నవాళ్లు ఉంటారు.. ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వారంతట వాళ్లు వెళ్లిపోతారని భావిస్తున్నారు. జమ్మలమడుగులోనూ ఆదినారాయణ కుటుంబంలో కొందరు టీడీపీలోనూ, ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనూ కొనసాగుతున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలసి పనిచేస్తాయని ఇటీవల వ్యాఖ్యానించిన ఆదినారాయణరెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరందరిపై చర్యలు తీసుకునే దిశగా పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి తీసుకుని త్వరలోనే ఈ ముగ్గురిపై వేటు పడే అవకాశాలున్నాయి.
Next Story