Sat Nov 23 2024 04:59:30 GMT+0000 (Coordinated Universal Time)
డబుల్ మాస్క్ వేసుకున్నా లాభం లేకపోయనే?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే వివాదాలకు తన మాటలతో తావు కల్పిస్తున్నారు
సోము వీర్రాజుకు ఏమయింది? వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సాధారణంగా బీజేపీ నేతలు టంగ్ స్లిప్ కారు. ఆచితూచి మాట్లాడుతుంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నేతలు కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతుంటారు కాని, దక్షిణాది బీజేపీ నేతలు మాత్రం కొంత సంయమనంగానే ఉంటారు. కానీ ఎందుకో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పదే పదే వివాదాలకు తన మాటలతో తావు కల్పిస్తున్నారు. ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో కూడా చర్చనీయాంశమైంది.
చీప్ లిక్కర్ పై....
సోము వీర్రాజు కొంతకాలం క్రితం చీప్ లిక్కర్ పై మాట్లాడి పార్టీని పలుచన చేశారు. తాము అధికారంలోకి వస్తే యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని, కోటిమంది తాగుబోతులు బీజేపీకే ఓటు వేయాలని కోరారు. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సోము వెంట పడ్డారు. సారాయి వీర్రాజుగా కూడా బిరుదు సంపాదించుకున్నారు. చివరకు తన ఉద్దేశ్యం అది కాదని, ప్రభుత్వ దోపిడీని తెలియజేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నానని కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
సీమ ప్రాంతంపై....
ఇక తాజాగా రాయలసీమపై చేసిన వ్యాఖ్యలు మరోమారు దుమారం రేపింది. రాయలసీమ, కడప జిల్లాలకు ఎయిర్ పోర్టులు ఎందుకని, హత్యలు చేసేవాళ్లకు ఎయిర్ పోర్టులు అవసరమా? అని ప్రశ్నించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. రాయలసీమ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నాలుక్కర్చుకున్న సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇప్పటికి రెండుసార్లు సోము వీర్రాజు నోరు జారి వీధిన పడ్డారు.
ఫ్రస్టేషన్...?
అయితే దీనికి కారణం ఏంటన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే విన్పిస్తుంది. సోములో ఇటీవల ఫ్రస్టేషన్ ఎక్కువగా కన్పిస్తుందంటున్నారు. త్వరలో తన అధ్యక్ష పదవీకాలం పూర్తి అవుతుండటం, అధినాయకత్వం తన మాటకు విలువ లేకుండా వ్యవహరించడంతోనే సోము వీర్రాజు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారంటున్నారు. కనీసం పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయకపోగా తన మాటలతో కమలాన్ని మరింత బలహీనం చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద సోము లో ఉన్న ఫ్రస్టేషన్ కు గల కారణాలను వెతికే పనిలో పడ్డారు ఏపీ బీజేపీ నేతలు.
- Tags
- somu veerraju
- bjp
Next Story