Sat Nov 23 2024 11:59:47 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ వారే... ఎలా ఒడ్డున పడతారో?
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖారారయింది. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖారారయింది. ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఆశావహులు సీనియర్ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల టీం కావడంతో జగన్ సామాజికవర్గాల సమీకరణాలు, ప్రభావితం చేయగల నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జగన్ ఇప్పటికే కేబినెట్ విస్తరణపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.
అన్ని సమీకరణాలు...
ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు కానుండటంతో ఆ లెక్కలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల సమయంలో కేబనెట్ విస్తరణ కావడంతో జగన్ ఆచితూచి సమీకరణ చేయాల్సి ఉంటుంది. సీనియర్ నేతలు వైసీపీలో అనేక మంది ఉన్నారు. వారిని సంతృప్తి పర్చడమే ఇప్పుడు జగన్ ముందున్న సవాల్. సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయితే వచ్చే ఎన్నికల్లో పార్టీకే నష్టమని చెప్పకతప్పదు.
సీనియర్ నేతలు.....
ప్రతి జిల్లాలో సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి, ఆర్కే రోజా, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోడుమూరు శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి వంటి నేతలు ఈసారి తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.
రెడ్డి సామాజికవర్గం.....
ఈ లెక్కలను జగన్ ఎలా క్రోడీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గం నేతలే మంత్రివర్గంలో చోటు దక్కడం కోసం పోటీ పడుతున్నారు. కూడికలు, తీసివేతలు జగన్ కు ఖచ్చితంగా తలనొప్పిగా మారనుంది. దీంతో పాటు ఎన్నికల్లో జిల్లాల్లో ప్రభావితం చేయగల నేతలు కూడా జగన్ కు కావాల్సి ఉంటుంది. ఈ రెండేళ్లు విపక్షాలు గట్టిగా పోరాడతాయి. విమర్శలు చేస్తాయి. వాటికి సమర్థవంతంగా సమాధానం చెప్పగలిగిన వారు కావాల్సి ఉంటుంది. మొత్తం మీద జగన్ కు ఈసారి మంత్రివర్గ విస్తరణ అంత సులువు కాదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.
Next Story