Mon Dec 23 2024 14:06:39 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం పుట్టినరోజు.... స్పీచ్ లో వారి ఊసే ఎత్తని జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టినరోజు నాడు విపక్షాలను విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన పుట్టినరోజు నాడు విపక్షాలను విమర్శించలేదు. ఒక్క విమర్శ కూడా లేకుండా కేవలం తన కార్యక్రమంపైన మాత్రమే ఆయన ప్రసంగం దాదాపు గంట సేపు కొనసాగింది. పుట్టిన రోజు నాడు విమర్శలు చేయకూడదనుకున్నారో? ఏమో జగన్ మాత్రం విపక్షాలపై ఎలాంటి విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించడం విశేషం. కేవలం అభివృద్ధి, పిల్లల చదువులపైనే ఆయన ప్రసంగించారు.
చదువుకు మించి...
పేద పిల్లలకు మంచి చదువు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బాపట్ల జిల్లాలోని యడ్లపల్లి పాఠశాల ఆవరణలో ఆయన ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు నాడు ఇలాంటి పథకాలను అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు. పేదల తలరాత మారాలంటే చదువనే ఆస్తిని అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ రూపంలో విద్య అందకూడదనే కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. పెత్తందారీ భావ జాలాన్ని చూస్తే తనకు బాధేస్తుందని జగన్ అన్నారు.
డిజిటల్ విప్లవానికి...
ప్రతి ప్రభుత్వ స్కూల్ లోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని జగన్ తెలిపారు. ప్రపంచంలో పేద విద్యార్థులు పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. 686 కోట్ల విలవుైన 5.18 లక్షల మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ట్యాబ్ లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విద్య, పౌష్టికాహారం వంటి అంశాల్లో ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇంటర్నెట్ లేకపోవడం కూడా అసమానతలు పెరగడానికి కారణమని అన్నారు. డిజిటల్ డివైడ్ అని ఆయన అన్నారు.
ప్రతి ఏటా పంపిణీ...
ప్రతి ఏడాది ఎనిమిదో క్లాస్ లోకి అడుగుపెడుతున్న చిన్నారులకు ట్యాబ్ లను అందిస్తామని జగన్ తెలిపారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ట్యాబ్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలోనూ చదువు నేర్చుకోవచ్చని తెలిపారు. అనేక భాషల్లో పాఠాలను రూపొందించారని చెప్పారు. పాఠాలు అర్థమయ్యే రీతిలో ఉంటాయన్నారు. చదువులో సమానత్వం ఉంటే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలకు ఈ ట్యాబ్ సపోర్టుగా ఉంటుందన్నారు. పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు.
సెక్యూర్డ్ డిజిటల్ కార్డు...
సెక్యూర్డ్ డిజిటల్ కార్డు కూడా ఇందులో పొందుపర్చి ఉందని, 8,9 పాఠాలు లోడ్ చేసి ఉంచారని అన్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా పాఠాలు చదువుకోవచ్చని తెలిపారు. ట్యాబ్ కు మూడు సంవత్సరాల వారంటీ ఉందని తెలిపారు. ట్యాబ్ ఎప్పుడైనా రిపేర్ వస్తే సచివాలయానికి వచ్చి ఇస్తే వెంటనే రిపేర్ చేసి ఇస్తారని, లేకుంటే కొత్త ట్యాబ్ ఇస్తారన్నారు. ఇందులో పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ ఉండదని అన్నారు. మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో ముందుగానే అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని మంచి కంటెంట్ ను అందించిందన్నారు. ఆయన ఈ సందర్భంగా బైజూస్ ను జగన్ అభినందించారు.
Next Story