Mon Dec 23 2024 15:41:28 GMT+0000 (Coordinated Universal Time)
అంత స్ట్రాంగ్ గా లేరా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల్లో తనను సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు
వైసీపీ అధినేత జగన్ తాను ఊహించినంత స్ట్రాంగ్ గా లేరా? ప్రజల్లో అసంతృప్తి ఉందా?. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు జగన్. కానీ ఎన్నికల్లో అన్నిసార్లూ పథకాలు పనిచేస్తాయా? లేదా? స్థానిక ఎమ్మెల్యేలు మదనపడుతున్న తీరిది. కార్యకర్తలు కూడా 2019 ఎన్నికల మాదిరి లేరన్నది వాస్తవం. అప్పటి ఎన్నికల్లో తెగించి పనిచేశారు. ఈసారి అలా చేస్తారా? లేదా? అన్న అనుమానం పట్టిపీడిస్తుంది. అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు వారిపై ప్రేమాభిమానాలు కురిపించినా గత ఎన్నికల్లో మాదిరి పనిచేసే అవకాశం ఉంటుందా? అన్నది కూడా సందేహమే.
పోస్టల్ బ్యాలెట్లను చూసి...
ఇక ప్రభుత్వోద్యోగుల్లో కూడా అభద్రత నెలకొందన్న అనుమానం ఎమ్మెల్యేల్లో ఉంది. గత ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు 90 శాతం మంది వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. కానీ ఇప్పుడా పరిస్థిితిపై అనుమానాలున్నాయి. "మొన్న జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువ వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నాం కానీ పోస్టల్ బ్యాలెట్ల పరిస్థితి వేరు. అక్కడ వైసీపీ స్థానిక నేతలు ఉద్యోగుల నుంచి పోస్టల్ బ్యాలట్లు సేకరించి వారే ఓట్లు వేశారు" అని ఎమ్మెల్యేలే అనుకుంటున్నారు.. పోస్టల్ బ్యాలెట్లను చూసి ఉద్యోగులంతా తమవైపే ఉన్నారనుకుని మురిసిపోతే అంతకన్నా అజ్ఞానం మరొకటి ఉండదని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తెలుగుపోస్టుతో ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. ప్రతిపక్షం లేదనుకోవడం పొరపాటే. అందరూ కలసి వచ్చినా తమను ఏం చేయలేరని స్టేట్మెంట్లు ఇవ్వడం ఆత్మవిశ్వాసం అనేకంటే అతివిశ్వాసమనే చెప్పాలన్నది కూడా ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది.
కసితో టీడీపీ క్యాడర్...
టీడీపీని తేలిగ్గా అంచనా వేయలేమంటున్నారు. తాము నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం కాబట్టి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయంటున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ రాష్ట్రంలో టీడీపీయే. వైసీీపీకి క్యాడర్ ప్రతి బూత్ లో ఉన్నప్పటికీ టీడీపీ క్యాడర్ కు మించిన కసి వారిలో కన్పించడం లేదు. ఎందుకంటే వారిపై కేసులు పెట్టడం, తమను అన్ని రకాలుగా గ్రామాల్లో అవమానపర్చడంతో టీడీపీ క్యాడర్ రగిలిపోతుందన్నది ఎక్కువమంది అభిప్రాయం. ఈసారి పార్టీని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారని, వైసీపీ క్యాడర్ లో అది కన్పించకపోవడాన్ని జగన్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
కొన్ని వర్గాలు...
ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ప్లీనరీకి బాగానే కార్యకర్తలను మొబలైజ్ చేసి ఉండవచ్చు. "151 మంది ఎమ్మెల్యేలు, వివిధ పదవులు పొందిన వందల సంఖ్యలో ఉన్న నేతల కృషి ఫలితమే అంతమంది జనం రావడానికి కారణం. స్వచ్ఛందంగా వచ్చారని చెప్పడం అంతకన్నా శుద్ధ అబద్ధం ఏదీ ఉండదు అని ఓ వైసీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. జగన్ పథకాలపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వకపోవడం, క్యాడర్ ను వైసీపీ నేతలు పట్టించుకోకపోవడం మైనస్ గా మారిందంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో కొన్ని ప్రధాన వర్గాలు ఇప్పటికే దూరమయినట్లు చెబుతున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. జగన్ కు త్వరగా తెలియాలని ఎమ్మెల్యేలు కోరుకుంటన్నారట.
Next Story