Sun Dec 29 2024 00:36:59 GMT+0000 (Coordinated Universal Time)
వీధుల వెంట జగన్.. కాలినడకనే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.వరద బాధితులను పరామర్శిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. నేరుగా కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి రాజంపేట వెళ్లారు. వరద ప్రభావితం ప్రాంతాల్లో జగన్ పర్యటిస్తున్నారు. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో పర్యటించారు. వరద బాధితులు రైతులతో జగన్ కొద్దిసేపు మాట్లాడారు. వారికి అందిన సహాయ కార్యక్రమాలపై జగన్ ఆరా తీశారు. పులపుత్తూరు గ్రామంలో కాలినడకన జగన్ పర్యటించారు.
బాధితులను నేరుగా....
ప్రతి బాధితుడిని అడిగి సమస్యను తెలుసుకున్నారు. ప్రతి ఇంటివద్ద ఆగి పరిష్కరించాల్సిన వాటి గురించి జగన్ అడిగి తెలుసుకుంటున్నారు. వారం రోజుల్లో పులపుత్తూరు గ్రామ సమస్య లను తీర్చాలని అధికారులను ఆదేశించారు. పులపుత్తూరు గ్రామంలో వరదల వల్ల మరణించడంతో అనాధలయిన పిల్లలతో కాసేపు గడిపారు. వారికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొందరికి వెంటనే ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాలని జగన్ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.
వారి నుంచి అర్జీలను...
గ్రామంలోని అన్ని వీధులను జగన్ తిరిగారు. బాధితులు ఇచ్చిన అర్జీలను తీసుకున్నారు. వారు చెప్పింది విని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. వెంటనే పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారు. ఎప్పటిలోగా ఇళ్లను పూర్తి చేస్తారో చెప్పాలని అధికారులను అక్కడే అడిగారు. కాసేపట్లో అధికారులతో జగన్ సమీక్ష చేయనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో జగన్ మందపల్లి గ్రామంలోకూడా పర్యటించనున్నారు.
Next Story