Thu Dec 19 2024 14:43:56 GMT+0000 (Coordinated Universal Time)
అర్బన్ లో వైసీపీ వీక్ అయిందా?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టంతా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేసుకుంటూ పోతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించింది గ్రామీణ ఓటర్లే. అర్బన్ ఓటర్లు పోలింగ్ కు కూడా రారు. అర్బన్ ప్రాంతాల్లో ఎప్పుడూ పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 80 శాతం పోలింగ్ ప్రతి ఎన్నికలో నమోదవుతూ వస్తుంది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టంతా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేసుకుంటూ పోతున్నారు. సంక్షేమ పథకాలతో జగన్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ గా ఉందని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు.
వీక్ గా వైసీపీ....
కానీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం వైసీపీ వీక్ గా ఉంది. పథకాల కోసం లక్షల కోట్లు వెచ్చించడం, అభివృద్ధి జరగకపోవడంతో అర్బన్ ప్రాంత ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారు. ప్రధానంగా ఉద్యోగ వర్గాలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. జీతాలు కూడా సకాలంలో చెల్లించకపోవడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఇక చెత్త పన్ను వేయడం, ఆస్తి పన్నులను పెంచడంతో అర్బన్ ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం పట్ల కొంత అసహనం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే చెప్పాలి. కానీ ఇటీవల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో కొంత పాజిటివ్ టాక్ వచ్చిందంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటు జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయడం, జగనన్న కాలనీలను ఏర్పాటు చేయడం వంటి వాటితో కొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో...
అయితే అర్బన్ ప్రాంతాల్లో పట్టు మరింత బిగిస్తే కాని మరోసారి విజయం దరి చేరదని భావిస్తున్న జగన్ పట్టణ ప్రాంతాల్లోనే ఇటీవల కాలంలో ఎక్కువగా పర్యటనలు చేస్తున్నారు. ఎక్కువగా పథకాలకు నగదు అందించే కార్యక్రమాలను పట్టణాల్లోనే చేస్తున్నారు. ఇటీవల కాలంలో మచిలీపట్నంలోని పెడన, నిన్న విశాఖపట్నం ఇలా ఎక్కువ భాగం పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించినట్లు కనపడుతుంది. పీకే టీం సర్వేల్లోనూ అర్బన్ ప్రాంతాల్లో పార్టీ వీక్ గా ఉందని నివేదికలు అందడంతో ఆ యా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను జగన్ అలర్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పట్ణణ ప్రాంత ఓటర్లలో కొంత మార్పు తేగలిగితే విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. అందుకే అర్బన్ ప్రాంతాలపై ఫోకస్ పెంచుతున్నట్లే కనపడుతుంది.
మీడియా ప్రభావం కూడా...
అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. మీడియా ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది. జగన్ వ్యతిరేక మీడియా చేస్తున్న ప్రచారం ఆయనకు కొంత ప్రతికూలతను అర్బన్ ప్రాంతంలో ఇప్పటికే కల్పించిందని చెప్పాలి. అందుకే దుష్టచతుష్టయం అంటూ చంద్రబాబు అనుకూల మీడియాపై ప్రతి సమావేశంలో జగన్ ధ్వజమెత్తుతున్నారు. కానీ అర్బన్ ఓటర్లు అంత సులువుగా పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం కొంత ఊరటకల్గించే అంశమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అర్బన్ ప్రాంతంలో ఎన్నికల సమయంలో డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంతే స్థాయిలో ఓట్లు సంపాదించడం అంత సులువు కాదు. అందుకే రూరల్ ఏరియాలో కొంత బలంగా ఉన్న జగన్ ఇటీవల కాలంలో అర్బన్ ప్రాంతాలపై ఫోకస్ పెట్టారన్నది వాస్తవం. మరి చివరకు ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే జగన్ జిల్లాల పర్యటనలను ప్రారంభించారు.
Next Story