Wed Nov 20 2024 06:30:49 GMT+0000 (Coordinated Universal Time)
గేమ్ మార్చిన జగన్... వచ్చే బిల్లులు అవేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశారు. అదే సమయంలో కొత్త బిల్లులతో వస్తామని శాసనసభలోనే ప్రకటించారు. అంటే మూడు రాజధానులతోనే జగన్ వచ్చే ఎన్నికలకు వెళ్తారు. మూడు రాజధానుల చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టం వంటివి న్యాయస్థానాల్లో నిలబడే అవకాశాలు లేవు. చట్టాల్లో లోపాలను గుర్తించిన ప్రభుత్వం దానిని సరి చేసుకోవడానికి ఇప్పుడు పాత వాటిని రద్దు చేసిందనే చెప్పాలి.
కొత్తగా తెచ్చే బిల్లులు...
అయితే కొత్తగా జగన్ ప్రభుత్వం తెచ్చే బిల్లులు ఎలా ఉండబోతున్నాయి? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. మూడు రాజధానుల్లో కొంత మార్పు చోటు చేసుకునే అవకాశముంది. న్యాయ రాజధానిని అమరావతిలోనే కొనసాగించనున్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును అప్పట్లో గుంటూరులోనే ఉంచాలని నిర్ణయించారు. శ్రీబాగ్ ఒప్పందం విషయాన్ని కూడా శాసనసభలో జగన్ ప్రస్తావించారు.
న్యాయ రాజధాని....
న్యాయరాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయడం ఈ మూడేళ్లలో సాధ్యం కాకపోవచ్చు. అందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. వాళ్ల కాళ్లావేళ్లా పడాలి. రాష్ట్రపతి ఆమోదముద్రతో పాటు సుప్రీంకోర్టు కూడా న్యాయరాజధాని కర్నూలులో ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పలు భరించే సమయం జగన్ కు లేదు. అందుకే న్యాయరాజధానిని అమరావతిలోనే ఉంచి శాసన రాజధానిని కర్నూలుకు తరలించాలని భావిస్తున్నట్టు సమాచారం.
మిగిలినవి అక్కడే....
శాసన రాజధాని తరలింపును ఎవరూ అడ్డుకోలేరు. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం లేదు. ఇక పరిపాలన రాజధానిని విశాఖకే తరలిస్తారు. కొత్తగా వచ్చే బిల్లుల్లో ఈ మార్పులు ఉంటాయని పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. గేమ్ మీరే కాదు నేను కూడా ఆడగలనని జగన్ ప్రత్యర్థులకు చెప్పేందుకే ఈ చట్టాలను రద్దు చేశారంటున్నారు. బహుశ సెప్టంబరు మొదటి వారంలో ఈ బిల్లులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అప్పటికి కొన్ని ఆటంకాలు కూడా తొలుగుతాయని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తం మీద మార్పులు, చేర్పులతో జగన్ మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని స్పష్టమయింది.
Next Story