Mon Dec 23 2024 12:07:41 GMT+0000 (Coordinated Universal Time)
త్రీ క్యాపిటల్స్... తెగేనా? తెల్లారేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ త్వరలోనే విశాఖలో పరిపాలనను ప్రారంభించనున్నారని తెలిసింది. వచ్చే నెలలోనే జగన్ విశాఖ వెళతారంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే విశాఖలో పరిపాలనను ప్రారంభించనున్నారని తెలిసింది. వచ్చే నెలలోనే జగన్ విశాఖ వెళతారంటున్నారు. జగన్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తాను చెప్పిన మాటలను అమలులోకి పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో ఆయన నిన్న క్లారిటీ ఇచ్చారు. అధికార వికేంద్రీకరణ ఈ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామ పరిపాల నుంచి రాష్ట్ర రాజధాని వరకూ ఇదే తమ విధానమని తెగేసి చెప్పారు. జగన్ ఇంతకూ మూడు రాజధానుల విషయంలో ఏం చేయబోతున్నారు? మరోసారి కొత్త బిల్లు తెస్తారా? తెచ్చినా అది న్యాయపరంగా నిలబడుతుందా? ఈ పది నెలలలో జగన్ ఏం చేయబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది.
సరిపడా బలమున్నా...
ఉభయ సభల్లో జగన్ పార్టీకి ఇప్పుడు సరిపడా బలం ఉంది. కొత్తగా మూడు రాజధానుల బిల్లులను పెట్టవచ్చు. కానీ మళ్లీ దానిపై న్యాయస్థానాలు అభ్యంతరం చెప్పవని గ్యారంటీ ఏంటి? ఎన్నికల లోపు మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభం కాకుంటే రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఇందులో జగన్ చేయలేనది ఒకే ఒక్కటి. అది కర్నూలుకు న్యాయ రాజధాని తేవడం. ఎందుకంటే హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ప్రభుత్వం కూడా ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతనే కర్నూలుకు న్యాయరాజధాని తరలి వెళ్లగలదు. అది ఈ రెండేళ్లలో సాధ్యమవుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే ఇందుకు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం ఫుల్లుగా అవసరం.
కర్నూలు మాత్రం...
ఇక అమరావతితో శాసనరాజధాని ఎటూ ఉండనే ఉంది. అమరావతిలోనే అసెంబ్లీ ఉంది కాబట్టి ఇక ఇక్కడ ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. ఇక విశాఖ పరిపాలన రాజధాని అంటే కొంత కసరత్తు చేయాల్సి ఉంది. సచివాలయాన్ని అక్కడకు తరలించాలి. అదీ అంత సులువు కాదు. ఇప్పటికిప్పుడు సచివాలయం సిబ్బందితో పాటు అధికారులందరినీ విశాఖకు తరలించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగులు ప్రభుత్వంపై కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే విజయవాడ కంటే విశాఖ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అక్కడికి తరలి వచ్చేందుకు ఉద్యోగులు ఇష్టపడక పోవచ్చు. వారికి ఉచితంగా వసతి సౌకర్యం కల్పించడమూ విశాఖలో కష్టమే. అందుకే జగన్ మాత్రమే అక్కడకు తరలి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇలా చేస్తారేమో...?
ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చు. ముందుగా పరిపాలన రాజధాని అని చెప్పారు కనుక తాను ముందు వెళ్లి అక్కడ నుంచి పాలన మొదలు పెడితే కనీసం ముఖ్యమైన అధికారులు అక్కడకు వస్తారు. ఎన్నికల వేళకు అక్కడి నుంచి పాలన సాగించారన్న పేరు తెచ్చుకోవచ్చు. కొత్తగా బిల్లులు పెట్టవచ్చు. ఆమోదించుకోవచ్చు. కానీ న్యాయపరంగా చిక్కులు ఎదురు కావని చెప్పలేం. మూడు రాజధానుల 2024 ఎన్నికల వరకూ ఈ సమస్య తెగదు. తెల్లారదు. కానీ రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు మాత్రం అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తాయి. అయితే జనం ఎవరి మాటను విశ్వసిస్తారన్నదే ముఖ్యం. అందుకే జగన్ మరోసారి మూడు రాజధానుల బిల్లులను శాసనసభ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మొత్తం మీద మరో రెండేళ్ల వరకూ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఏదంటే ఎవరూ చెప్పలేరన్నది మాట వాస్తవం.
Next Story