Fri Nov 15 2024 01:17:57 GMT+0000 (Coordinated Universal Time)
జనంలోకి వెళ్లి జగన్ కు కాక పుట్టిస్తారా?
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కొంత అసంతృప్తి బయలుదేరిందనే చెప్పాలి.
ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో కొంత అసంతృప్తి బయలుదేరిందనే చెప్పాలి. ఇప్పటికే పార్టీకి మద్దతుదారుగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. డీఎల్ రవీంద్రారెడ్డి తన మద్దతుదారులకు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తెలిసింది. రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలో తన మద్దతు దారులను టీడీపీకి మద్దతిచ్చేలా ఆయన పరోక్షంగా సహకరించారంటున్నారు.
పక్కన పెట్టడంతో...?
డీఎల్ రవీంద్రారెడ్డి సీనియర్ అయినా జగన్ ఎటువంటి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన రివర్స్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మైదుకూరు లో వైసీపీని ఓడించి తీరుతామని ఆయన శపథం చేస్తున్నారు కూడా. త్వరలోనే డీఎల్ రవీంద్రారెడ్డి నియోజకవర్గం అంతటా పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని తన ముఖ్య అనుచరులతో సమావేశమయిన డీఎల్ రవీంద్రారెడ్డి పర్యటనకు సిద్ధమవుతున్నారు.
నియోజకవర్గం అంతటా....
జనంలోకి వెళ్లి జగన్ కు కాక పుట్టించాలన్నది డీఎల్ రవీంద్రారెడ్డి ఆలోచనగా ఉంది. ఇందుకోసం ఆయన ప్రతి గ్రామాన్ని పర్యటించాలని భావిస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎలా దోపిడీ జరుగుతుందో ప్రజలకు వివరించాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో పాటు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు జరిగిన అన్యాయాన్ని కూడా డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పనున్నట్లు తెలిసింది.
మరికొందరు నేతలు...
డీఎల్ రవీంద్రారెడ్డి తో పాటు మరికొందరు నేతలు కూడా వైసీపీని వీడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డితో పాటు పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి కూడా తిరిగి టీడీపీలో చేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఆయన వైసీపీలో చేరలేదు. రామసుబ్బారెడ్డి కూడా అంతే. అసమ్మతి నేతలందరూ కలసి కట్టుగా ఒక్కసారి జంప్ చేసే అవకాశాలున్నాయి. డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం టీడీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారు.
Next Story