Mon Dec 23 2024 14:23:32 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ సరిగా డీల్ చేయలేకపోయారా? నిద్ర పోతే ఇక అంతే
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం. ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజోపయోగంగానే ఉండాలి. ఈ మూడేళ్లలో ప్రభుత్వంపై ఏ వర్గాలపై వ్యతిరేకత ఉందో దానిని దూరం చేసుకోవాల్సి ఉంది. అప్పుడే జగన్ ప్రభుత్వానికి మరోసారి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. కానీ రెండేళ్ల సమయం ఉన్న తరుణంలో జగన్ కు కొన్ని వర్గాలు దూరమవుతున్నాయా? అంటే అవుననే చెప్పాలి.
వారి క్యాంపెయిన్...
ప్రభుత్వ ఉద్యోగుల సంగతే తీసుకుంటే... సమస్యను జగన్ సర్కార్ సక్రమంగా డీల్ చేయలేకపోయారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలకంగా మారతారు. ప్రభుత్వానికి వ్యతిరేకమయినా? అనుకూలమయినా? వారి క్యాంపెయిన్ మౌత్ ద్వారానే ఉంటుంది. చాపకింద నీరులా ఉద్యోగులు ప్రజల్లో ప్రభుత్వంపై ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయగల శక్తి ఉంది.
రెండు నెలల నుంచి...
ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్ మెంట్ వంటి అంశాలను జగన్ ప్రభుత్వం దాదాపు రెండు నెలల నుంచి నానుస్తుంది. చర్చల మీద చర్చలు జరిపింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీతో సహా ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఉద్యోగులకు అన్యాయం చేయబోమనే సంకేతాలను వారిలోకి బలంగా పంపారు.
ఫైనల్ గా ఇబ్బంది పడేది....
చివరకు జగన్ కూడా ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రితో సమావేశంతో సమస్య ఒక కొలిక్కి వస్తుందని అనుకున్నారు. కానీ ఆ సమావేశం తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా మారింది. ఈరోజు సమ్మె విషయంలో ఉద్యోగ సంఘాలు ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. సమ్మెతో నష్టం ఎవరికి అన్నది పక్కన పెడితే వారు సమ్మెలోకి వెళితే ప్రజలు ఇబ్బంది పడతారు. సంక్షేమ పథకాల వంటివి అమలుకు నోచుకోవు. దీంతో ఫైనల్ గా ఇబ్బంది పడేది ప్రభుత్వమే. ఇప్పుడు జగన్ వెనక్కు తగ్గి వారి డిమాండ్లకు తలొగ్గితే అది తమ విజయంగా వారు భావిస్తారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రం ఉండబోరు. అందుకే జగన్ సున్నితంగా డీల్ చేయాల్సిన ఉద్యోగుల అంశాన్ని అతి విశ్వాసానికి పోయి జటిలం చేసుకున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story