ఆంధ్రప్రదేశ్ లో నాగలోకం ....?
ఏపీలోని కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ వాసులు పాము కనపడితే కాదు పేరు చెబితేనే గజగజా వణుకుతున్నారు. వరుసపెట్టి పాములు జనాలను ఎడా పెడా కాటేస్తుంటే ఎవరు మాత్రం భయపడరు. ఇప్పుడు అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి నిండా పాము కాటు బాధితులే కనిపిస్తున్నారు. ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని స్థానికులు ఇక భగవంతుడే దిక్కు అని భావించి ఇక సర్పయాగమే తమను కాపాడే మార్గమని నిర్ణయించారు. ఈనెల మోపిదేవి సుబ్రమణ్య స్వామి ఆలయంలో దీనికి సంబంధించి పూజా, హోమాలు భారీ ఎత్తున తలపెట్టారు ప్రజలు.
పగలు, లేదు రాత్రి లేదు ...
అవనిగడ్డ, కోడూరు ప్రాంతాల్లో పగలు లేదు రాత్రి లేదు సర్ప రాజాలు వీరవిహారమే చేస్తున్నాయి. గత ఏడు నెలలో 250 మంది పాము కాటుకు ఈ ప్రాంతాల్లో ప్రజలు గురి అయ్యారు. ప్రభుత్వ లెక్కల్లోనే ఈ స్థాయి ఉందంటే చాలామంది ప్రయివేట్ వైద్యం చేయించుకున్నవారు లెక్కకు అందనంతే వున్నారు. గత నెలరోజుల్లో 150 మంది పాము కాటుకు గురి అయ్యారు. వీరిలో ఈ ఒక్క వారంలోనే 48 మంది చావుదగ్గరకు వెళ్ళివచ్చేశారు. వీరంతా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవనిగడ్డ లో వున్న ప్రత్యేక పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పాముకాటుకు అవసరమైన మందులను పిహెచ్ సి లలో ఏరియా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచింది. ఈ సర్ప విహారానికి ఎలా బ్రేక్ వేయాలో తెలియక అధికారయంత్రాంగం సైతం తీవ్ర ఆందోళన చెందుతుంది.