Mon Dec 23 2024 11:44:56 GMT+0000 (Coordinated Universal Time)
కలిసినా... కలవక పోయినా.. అంతేనా?
ఇప్పటి వరకూ ఏ ఎన్నిక జరిగినా అది వైసీపీ ఖాతాలోనే పడుతుంది. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఫలితాలు కూడా వన్ సైడ్ అనే చెప్పాలి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజించిన తర్వాత ఏపీలోనూ రాజకీయంగా వన్ సైడ్ ఉండటం ఎప్పుడూ చూడలేదు. ప్రజలు ఒక ఎన్నికలో ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే మరొక ఎన్నికలో మరో పార్టీవైపు చూస్తారు. కానీ గత రెండున్నరేళ్లుగా ఏ ఎన్నిక జరిగినా అది వైసీపీ ఖాతాలోనే పడుతుంది. ఇటీవల వెలువడిన మున్సిపల్ ఫలితాలు కూడా వన్ సైడ్ అనే చెప్పాలి. దీనికి కారణాలేంటి?
బీజేపీ, జనసేనలు...
నిజానికి పోటుగాళ్లమని చెప్పుకుంటున్న బీజేపీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించ లేదు. ఇక లేస్తే మనిషిని కాను అనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ ప్రతినిధులు ఆకివీడులో మూడు వార్డులు, దాచేపల్లి, గురజాలలో ఒక వార్డులో గెలిచారు. లోపాయికారీగా టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుని బరిలోకి దిగినా జనసేన కు పెద్దగా ఫలితం కన్పించలేదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని భావించిన టీడీపీ, జనసేన, బీజేపీలకు ప్రజలు మరోసారి కవుకు దెబ్బ కొట్టారు.
వన్ సైడ్ గా...
ఎందుకు వన్ సైడ్ గా ప్రజలు తీర్పు చెబుతున్నారు. పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదయింది. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీదే పై చేయి అయింది. ఇప్పుడు మూడు పార్టీలూ పునరాలోచనలో పడ్డాయి. లోపం ఎక్కడ ఉందో తెలుసుకునే పనిలో పడ్డాయి. బీజేపీకి అసలు ఓటు బ్యాంకు లేదు. జనసేన బీజేపీతో కలసి ఉన్నంత కాలం ఎదిగి రాదన్నది అనేక సార్లు స్పష్టమయింది.
అంచనాలు....
ఇక టీడీపీ కూడా ఈ ఫలితాలను చూసి షాక్ కు గురయింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో జరిగిన ఈ ఎన్నికలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనాలు వేసుకుంది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజలు వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారని మరోసారి స్పష్టమయింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ లోని విపక్ష పార్టీలు అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలను పక్కన పెట్టి పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టడం మంచిదేమో.
Next Story