Sat Nov 23 2024 08:38:59 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల టీం రెడీ.. కొత్త మంత్రులు ఎవరంటే?
మంత్రివర్గ విస్తరణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమయినట్లే కనిపిస్తుంది. ఎన్నికల టీంను రెడీ చేసుకుంటున్నారు
మంత్రివర్గ విస్తరణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమయినట్లే కనిపిస్తుంది. ఇటీవల గవర్నర్‌ను కలసి కూడా అదే అంశంపై చర్చ జరిపినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ప్రస్తుత మంత్రివర్గంలో కొందరిని తొలగించాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల టీంను పకడ్బందీగా ఏర్పాటు చేయడానికి జగన్ రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు.
వరస ఓటములతో...
ఇటీవల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో జగన్ పార్టీ ఓటమి పాలు కావడంతో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇలాంటి బలహీనమైన టీంతో వెళ్లడం కష్టమని భావించిన జగన్ విస్తరణవైపు మొగ్గు చూపుతున్నారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. సామాజికవర్గాల సమీకరణ కాకుండా పనితీరు ఆధారంగానే ఈసారి మంత్రివర్గంలో ఎంపికలు ఉంటాయని చెబుతున్నారు.
కొడాలి నానిని...
మంత్రివర్గంలోకి మరోసారి కొడాలి నానిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్మ సామాజికవర్గం నుంచి ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో పాటు బలమైన గొంతు అవసరమని భావిస్తున్నారు. అందుకే కొడాలి నానికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అలాగే కడప జిల్లా నుంచి అంజాద్ భాషాను తప్పించి ఆయన స్థానంలో గుంటూరు జిల్లా నుంచి ముస్తాఫాకు అవకాశం కల్పిస్తారంటున్నారు. కడప నుంచి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి మంత్రివర్గంలో ఈసారి చోటు కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. తొలి నుంచి నమ్ముకుని ఉన్న గడికోట శ్రీకాంత్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారు.
నమ్ముకున్న వారికి...
వీరితో పాటు నెల్లూరు జిల్లా నుంచి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. జనంలోకి వెళ్లాలంటే కేబినెట్ బలంగా ఉండాలని జగన్ భావించడమే ఈ మంత్రివర్గ విస్తరణకు కారణమంటున్నారు. అసంతృప్తి ఉన్న వారితో పాటు, తనతో దీర్ఘకాలం అంటిపెట్టుకున్న వారికి ఈ దఫా మంత్రిపదవులు లభించే అవకాశముందని చెబుతున్నారు. అయితే తక్కువ సంఖ్యలోనే మార్పులుంటాయని, రాజ్‌భవన్‌లోనే పరిమితంగా మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అన్నీ కుదిరితే రెండు రోజుల్లోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story