Sat Nov 16 2024 14:31:52 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జలకు జగన్ ఊహించని ట్విస్ట్...?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ ఊహించని ట్విస్ట్ ఇస్తారంటున్నారు
ఎవరైనా తాము ప్రేమించి, నమ్మిన వ్యక్తిని టార్గెట్ చేస్తే అది ఆ వ్యక్తికే ఉపయోగమవుతుంది. రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు కాని జగన్ కాని, తమ మనుషులు అనుకున్న వారిని పదే పదే విమర్శిస్తుంటే ఆ నేతను మరింత దగ్గరకు తీసుకుంటారు. జగన్ కూడా అంతే. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ ఊహించని ట్విస్ట్ ఇస్తారంటున్నారు. అవును అందరూ అంటుందే జగన్ చేసేస్తారట.
నమ్మకమైన వ్యక్తిగా....
సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు అత్యంత ఇష్టుడు. నమ్మకమైన వ్యక్తి. వ్యక్తి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయన నేత కాదు. నమ్మకమైన మిత్రుడు అంతే. ఆయన స్వతహాగా జర్నలిస్టు. రాజకీయ అవగాహన ఉన్నా ఎప్పుడూ ఆయన దాని జోలికి పోలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా విపక్షంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కొంత వరకే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల ప్రాముఖ్యత పెరిగింది. ఏది చేయాలన్నా, ఏది వినిపించాలన్న సజ్జల చేతుల మీదగా, నోటి ద్వారానే చెప్పిస్తారు. ఇది అందరికీ తెలిసిందే.
ఉద్యోగులు కూడా....
అయితే ఇటీవల ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రుల కమిటీలో జగన్ చేర్చారు. అంతకు ముందు కూడా ప్రభుత్వ సలహాదారు హోదాలోనే ఆయన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఎప్పుడైతే చర్చలు బెడిసికొట్టాయో అప్పుడు ఉద్యోగ సంఘాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాయి. ఆయనను రాజ్యాంగేతర శక్తిగా చెబుతున్నాయి. ఇక విపక్షాల కన్ను మొత్తం సజ్జల పైనే ఉంది. ఉద్యోగ సంఘాల ఆందోళనలోనూ జగన్ ఆలోచనలనే సజ్జల అమలు పర్చారు. మొత్తానికి సమ్మె విరమణ జరిగినా సజ్జల మాత్రం అందరికీ లక్ష్యమయ్యారు.
కేబినెట్ లోకి తీసుకుని...
నిన్న మొన్నటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్న జగన్ ఖచ్చితంగా తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని తెలిసింది. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో సజ్జలకు చోటు ఉంటుందని చెబుతున్నారు. మంత్రిగా చేసి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలన్నది జగన్ ఆలోచనగా ఉందంటున్నారు. ఉద్యోగ సంఘాల ఆందోళన తర్వాతనే ఈ ఆలోచన జగన్ లో మరింత బలపడినట్లు తెలిసింది. మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ కు ఊహించని గిఫ్ట్ ఇస్తున్నారని పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
Next Story