Mon Dec 23 2024 16:35:33 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆ ఛాన్స్ బాబుకు ఇవ్వరట.. అందుకే ఫ్రస్టేషన్
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనకు అనుకూలంగా మారతాయనుకున్న అంశాలన్నీ జగన్ ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వెళుతున్నారు
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తనకు అనుకూలంగా మారతాయనుకున్న అంశాలన్నీ జగన్ ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇది చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. ఇంకా ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండటంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న విమర్శలు ఎన్నికల నాటికి పనికి రాకుండా పోయేలా జగన్ చేస్తున్నారు. ఇది చంద్రబాబుకు మరింత ఆగ్రహాన్ని కల్గిస్తుంది. అందుకే మరోసారి బాబు ఫ్రస్టేషన్ కు లోనయ్యారు.
మద్యం బ్రాండ్లు....
ఉదాహరణకు మొన్నటి వరకూ చంద్రబాబు మద్యం బ్రాండ్ల మీద మాట్లాడేవారు. ముఖ్యమైన బ్రాండ్లను ప్రజలకు దూరం చేసి వారి ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని చెప్పేవారు. చంద్రబాబు గంటన్నర స్పీచ్ లో మద్యం కూడా ఒక అంశం. కానీ ఇప్పుడు అన్ని బ్రాండ్లను ప్రభుత్వం తెచ్చేసింది. మద్యం ప్రియులు కూడా హుషారుగా ఉన్నారు. దీంతో చంద్రబాబు సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి బ్రాండ్ల సమస్య పోయి చంద్రబాబు చేతికి సంపూర్ణ మద్యనిషేధ నినాదం వచ్చింది.
రహదారుల దుస్థితి....
ఇక ఆంధ్రప్రదేశ్ లో రహదారుల దుస్థితిపై చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు. రహదారులు నాగరికతకు చిహ్మాలని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు టెండర్లు పిలిచింది. కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని చంద్రబాబు చెబుతున్నారు. కానీ జగన్ ప్రభుత్వం త్వరలోనే రహదారుల మరమ్మతులను పూర్తి చేయడానిక కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతుంది. ఇవి కూడా పూర్తయితే ఎన్నికల నాటికి ఈ నినాదం చంద్రబాబు వద్ద ఉండకపోవచ్చు.
ప్రభుత్వోద్యోగులు....
ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత ఉందని, వారు తనకు మద్దతుగా ఉంటారని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సమస్యను కూడా రేపో, మాపో జగన్ పరిష్కరిస్తారు. ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే జీతాలను సకాలంలో చెల్లిస్తారు. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండటంతో చంద్రబాబు ప్రస్తుతం లేవనెత్తే సమస్యలు అప్పుడు ఉండకపోవచ్చు. వాటిని జగన్ ప్రభుత్వం పరిష్కరిస్తే ప్రజలు సులువుగా మరచిపోతారు. అదే చంద్రబాబును ఇప్పుడు వేదిస్తున్న సమస్య. కొత్త సమస్యలు పుట్టుకు రాక మానవు. వాటిపైనే ప్రజల్లోకి చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న సమస్యలపై (ప్రత్యేక హోదా మినహాయించి) ప్రజల్లోకి వెళ్లే ఛాన్స్ చంద్రబాబుకు జగన్ ఇవ్వరంటున్నారు.
Next Story