Mon Dec 23 2024 07:12:06 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదు: మంత్రి రోజా
బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన అమాయకుడు అనిపిస్తోందనీ, జాలి వేస్తోందని అన్నారు రోజా. ఇంతవరకూ నిమ్మకూరుకు..
తిరుపతి : ఏపీ టూరిజం, క్రీడల శాఖ మంత్రి రోజా శనివారం నాడు ఆమె నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు వింటేనే చంద్రబాబుకు నచ్చదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, టీడీపీ పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడు అని స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసి, నేడు వారి ఫోటోకి దండలు, దండం పెడుతూ బాబు భలేగా నటిస్తున్నారని విమర్శించారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే.. కనీస కృతజ్ఞత కూడా చెప్పలేదని, అదీ ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్న ప్రేమ అని ఘాటుగా విమర్శించారు. బాలకృష్ణను చూస్తే జాలేస్తుందన్నారు.
బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన అమాయకుడు అనిపిస్తోందనీ, జాలి వేస్తోందని అన్నారు రోజా. ఇంతవరకూ నిమ్మకూరుకు రాని బాలయ్య ఇప్పుడు ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పి, పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన తరవాత బాలకృష్ణలో కదలిక వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. అందుకే ఆయన నిమ్మకూరు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చంద్రబాబు రాసే స్క్రిప్ట్ చదవడం మానేసి బాలకృష్ణ.. ఎన్టీఆర్ వారసుడిగా బయటకు రావాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్కి భయపడ్డారని, అందుకే ఆయన్ను పార్టీ నుంచి దూరం పెట్టారని.. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా మహానాడులో సీఎం జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు.
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్య అని.. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని ప్రశంసించారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలే ప్రసక్తే లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు. మహానాడు నాడు అని పెట్టి మహిళలతో నీచాతినీచంగా మమ్మల్ని తిట్టిస్తున్న ఘటనలు చూస్తున్నామని., రాష్ట్రానికి, తెలుగు దేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని గతంలో ఎన్టీఆర్ అన్నారని రోజా గుర్తు చేశారు. మామ ప్రాణాలు తీసిన చేత్తోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంత ఘనుడో ప్రజలకే తెలుసన్నారు.
Next Story