Mon Dec 23 2024 11:07:01 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మేకపాటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ..
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్(50) రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈరోజు ఉదయం తీవ్ర గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన మరణించిన అపోలో వైద్యులు 9.16 గంటలకు ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేకపాటి గౌతమ్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ విజయసాయిరెడ్డిలు మేకపాటి మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
మేకపాటి గౌతంరెడ్డి హఠాస్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో అన్నారు. చివరి నిముషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్ధుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరువలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకుడు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక, నైపుణ్యభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకు రావడం వెనక ఆయన విశేషమైన కృషి దాగి ఉందని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని కృష్ణదాస్ వ్యక్తం చేశారు.
మంత్రి ఆళ్ల నాని
మంత్రి మేకపాటి మృతిపట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం మంత్రి గౌతమ్ రెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. నిన్నటి వరకూ ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దుబాయ్ లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి.. ఇకలేరన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గౌతమ్ రెడ్డి మరణం ఇటు పార్టీకి.. అటు ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆళ్ల నాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మంత్రి అనిల్ కుమార్
మంత్రి మేకపాటి మృతి పట్ల ఏపీ మంత్రి అనిల్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయానంటూ భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మరణవార్త తెలియగానే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నవయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి అకాలమరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధించిందన్నారు. గౌతమ్ రెడ్డి మరణం వైకాపాకు, రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు.
మంత్రి బాలినేని
గౌతమ్ రెడ్డి చాలా సరదా మనిషి అని, అందరితో సరదాగా మాట్లాడుతుండేవారని మంత్రి బాలినేని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి చెంది, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. గౌతమ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మంత్రి బాలినేని పేర్కొన్నారు.
Next Story