Mon Dec 23 2024 12:24:39 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరిపై ఎంత మమకారం..?
ఏపీ రాజకీయం ఎప్పుడూ హీట్ గానే ఉంటుంది. ఎన్నికల ఫలిితాలు వెలువడిన ఒకట్రెండు నెలలు మినహా ఆ తర్వాత అంతా రాజకీయమే కనపడుతుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ హీట్ గానే ఉంటుంది. ఎన్నికల ఫలిితాలు వెలువడిన ఒకట్రెండు నెలలు మినహా ఆ తర్వాత అంతా రాజకీయమే కనపడుతుంది. వినపడుతుంది. ఎన్నికలకు రెండేళ్లు ముందు ఏపీలో పాలిటిక్స్ హీటెక్కిందనడం వెర్రితనమే. నిత్యం రాజకీయం సలసల మరిగిస్తుండటమే ఆంధ్రప్రదేశ్ లో పార్టీల ప్రధాన లక్ష్యం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. పొరుగున ఉన్న తెలంగాణలో ఒకే పార్టీ రెండు సార్లు గెలిచినా, ఏపీలో మాత్రం ప్రజలు మార్పు కోరుకున్నారు. ఈ సారి మార్పు కోరుకుంటారా? లేదా? అన్న చర్చ జరుగుతుంది.
బాబును ఐడియాలన్నీ...
2014లో చంద్రబాబు పాలనను ప్రజలు చూశారు. ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కలల్లో విహరింప చేశారు. అమరావతి రాజధానిగా చేసి మిగిలిన ప్రాంతాలను విస్మరించారు. హైదరాబాద్ తరహాలోనే చంద్రబాబు ఐడియాలు సాగాయి. చివరకు హైకోర్టును కూడా రాయలసీమకు కేటాయించలేదు. ఇక రాజధాని అమరావతి అభివృద్ధి బాబు హయాంలో జరగలేదు. తాత్కాలిక భవనాలు నిర్మించారు. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. సంక్షేమ పథకాలను పెద్దగా పట్టించుకోలేదు. అన్ని వర్గాల్లో అసంతృప్తి బయలుదేరి చివరకు చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణంగా పార్టీని ఓటమి బాట పట్టించారు.
బాబుకు రివర్స్...
ఇప్పుడు జగన్ పాలన చూస్తున్నారు. అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి సంక్షేమం వైపు జగన్ చూస్తున్నారు. అమరావతిని పక్కన పెట్టేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినా అది కూడా ఇంతవరకూ వివిధ కారణాలతో సాథ్యపడలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా వచ్చే రెండేళ్లలో పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అన్నీ అడ్డంకులే. ఆ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఇటు జగన్, అటు చంద్రబాబు విఫలమయ్యారన్న ఆరోపణలు ఎన్నికల సమయంలో ఎదుర్కొనక తప్పదు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అప్పులు ఏడు లక్షల కోట్లకు చేరాయి.
పవన్ ను పట్టించుకుంటారా?
జగన్, చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ ను కోరుకుంటారా? అంటే చెప్పలేని పరిస్థితి. సినిమా హీరోలపై వీరాభిమానం ఉన్నప్పటికీ రాజకీయాలకు వచ్చేసరికి ప్రజలు మొగ్గు చూపరు. అందులోనూ ఏపీలో పవన్ కల్యాణ్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోెవడం కష్టమేనన్నది విశ్లేషకుల అంచనా. గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెంచుకోవచ్చేమో కాని, అధికారం చేపట్టే దిశగా పవన్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారనుకోవడం అత్యాశే అవుతుంది. ఇప్పుడు ప్రజలు ఎవరి పక్షాన మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న మూడ్ ను బట్టి చంద్రబాబును నమ్మరు. పవన్ ను పట్టించుకోరు. జగన్ కు మరోసారి అవకాశం ఇవ్వడానికి ఇష్టపడరు. అయితే పోలింగ్ రోజు ఎవరి స్ట్రాటజీ ఫలిస్తే వారిదే అధికారం. అది ఎవరైనా కావచ్చు.
Next Story