Fri Dec 27 2024 18:14:22 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులు.. మౌనం.. వాయిస్ లేని వైసీపీ
జగన్ కొత్త మంత్రి వర్గంలో ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరూ చురుగ్గా లేరు
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. తొలి దఫాలో ఏర్పాటయిన మంత్రి వర్గం దాదాపు మూడేళ్లు పనిచేసింది. అనంతరం ఐదు నెలల క్రితం జగన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. కొందరికి తప్ప తన మంత్రి వర్గంలో ఎవరికీ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. కొత్త వారికి అవకాశం కల్పించారు. సామాజికవర్గాల వారీగా మంత్రులను ఎంపిక చేశారు. అత్యధికంగా బీసీలను ఎంపిక చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే పాత, కొత్త మంత్రి వర్గంలో విపక్షాలకు ధీటుగా సమాధానమిచ్చే వారు ఐదు నెలల నుంచి కరువయ్యారు. కొత్త మంత్రివర్గంలో పెద్దగా జనంలోకి వెళ్లేలా మాట్లాడగలిగిన నేతలు లేరు.
కొత్త మంత్రివర్గంలో...
ఇక కొత్త మంత్రి వర్గంలో ఉన్న వారిలో ఇద్దరు ముగ్గురు తప్పించి ఎవరూ చురుగ్గా లేరు. పార్టీ అధినేత జగన్ పై వచ్చిన విమర్శలను కూడా ఎవరు ఖండించే పరిస్థితి కన్పించడం లేదు. కొత్త మంత్రి వర్గంలో జోగి రమేష్, ఆర్కే రోజా, దాడిశెట్టి రాజా వంటి వారు కొంత విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన వారు అసలు తాము మాట్లాడాల్సిన పనిలేదు అనుకున్నారా? లేక తమకెందుకు వచ్చిన గొడవ అనుకున్నారో కాని పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. అసలు ఎక్కువ మంది మంత్రులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు.
జిల్లా ఇన్ ఛార్జులుగా నియమించడంతో....
ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత పాత మంత్రులను జిల్లా ఇన్‌ఛార్జులుగా జగన్ నియమించారు. పాత మంత్రులు మూడేళ్లు ఉండటంతో క్యాడర్ పై గ్రిప్ పెరిగింది. ఇప్పుడు జిల్లాను వారే శాసిస్తుండటంతో కొత్త మంత్రులకు పెద్దగా పనిలేకుండా పోయింది. అందుకే వారు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఫోకస్ అయ్యేందుకు కూడా 80 శాతం మంది మంత్రులు ప్రయత్నించడం లేదనే చెప్పాలి. ఇక అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు కూడా మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత మౌనంగానే ఉంటున్నారు.
మాజీ మంత్రుల్లోనూ...
ఇక గత మంత్రివర్గంలో ఉన్న వారిలో పేర్ని నాని, కొడాలి నాని మినహా ఎవరూ పెద్దగా యాక్టివ్ గా లేరు. తమకు పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతల వరకే వారు పరిమితమవుతున్నారు. దీంతో మీడియాలో వైసీపీ వాయిస్ తగ్గిందన్న కామెంట్స్ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విపక్షాలు తమ గొంతును పెంచుతున్నాయి. జగన్ పైనా, పార్టీ నేతలపైన అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. అయినా వాటిని ఖండించేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ కూడా కొంత సీరియస్‌గానే ఉన్నట్లు తెలిసింది. మరి కొత్త, పాత మంత్రుల్లో ఇప్పటికైనా చురుకు పుడుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story