Mon Dec 23 2024 20:07:14 GMT+0000 (Coordinated Universal Time)
పనిచేయరు.. పెత్తనం మాత్రం కావాలి
తెలంగాణలో కాంగ్రెస్ కమిటీల నియామకం చిచ్చు రేపింది. తమకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్లు మండి పడుతున్నారు
ఈ మాట పార్టీలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల మదిలో ఉంది. పనిచేయరు. పదవులు కావాలి. ఉప ఎన్నికలు వస్తే డబ్బులు పెట్టడానికి ముందుకు రారు. కానీ పెత్తనం మాత్రం వారి చేతుల్లోనే ఉండాలి. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయితే మాత్రం నెపాన్ని మాత్రం ఇతరులపై నెట్టేందుకు ముందుంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నది ఇదే. రెండుసార్లు పార్టీ అధికారంలోకి రాకపోయినా వారికి పరవాలేదు. వారికి గెలుపు ముఖ్యం కాదు. పదవులను అలంకరించడమే ప్రధానం. ఇలాగయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా గెలుస్తుందా? అంటే లేదన్న విషయాన్ని ఖచ్చితంగా ఎవరైనా చెబుతారు.
కమిటీల నియామకం...
తెలంగాణలో కాంగ్రెస్ కమిటీల నియామకం చిచ్చు రేపింది. తమకంటే జూనియర్లకు ప్రాధాన్యత ఇచ్చారని సీనియర్లు మండి పడుతున్నారు. కొందరు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు నేరుగా పార్టీ నిర్ణయాలను తప్పు పడుతూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు కాంగ్రెస్ కమిటీల నియామకాలపై విరుచుకుపడ్డారు. విష్ణు ఏరోజూ పార్టీ కార్యాలయానికి రారు. కార్యక్రమాల్లో పాల్గొనరు. కానీ ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం టిక్కెట్ కోసం ముందుంటారు. పదవులు తమకే కావాలని పట్టుబడుతుంటారు. ఇలాంటి వాళ్లతో పార్టీకి ఉపయోగం ఏముంటుందన్న ప్రశ్న తలెత్తుతుంది.
గెలిస్తే మాత్రం...
ఇక దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ అధికారంలో ఉంటే మంత్రి పదవి గ్యారంటీ. గతంలోనూ ఉప ముఖ్యమంత్రిగా చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దో గొప్పో లాభపడిన రాజనరసింహ తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకోవడం మానేశారు. ఇక హైదరాబాద్ కే పరిమితం అవుతారు. పాత తరం రాజకీయాలను చేయడానికి ముందుంటారు. కాంగ్రెస్ లో ఇంకా తమ కటౌట్లు చూసి ఓట్లు వేస్తారని భ్రమించే వాళ్లే ఎక్కువమంది ఉన్నారు. అందుకే వారు జనంలోకి వెళ్లరు. పార్టీకి పనికి రారు. పదవులు ఇవ్వకపోతే మాత్రం అలుగుతారు. పార్టీ అధినాయకత్వంపై కాలుదువ్వుతుంటారు. కోవర్టులంటూ కేకలు పెడుతుంటారు.
హైదరాబాద్ కే పరిమితం....
వరంగల్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కే పరిమితమయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎవరూ హైదరాబాద్ ను వదలరు. నియోజకవర్గాలకు తమకు తోచినప్పుడు వెళ్లి టూర్ చేసి వస్తారు. అందుకే టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను తమకు పోటీ దారుగా చూడడటం లేదు. బీజేపీని చూసైనా కాంగ్రెస్ నేతల్లో చురుకుకలగడం లేదు. ప్రజలే తమను గెలిపించుకుంటారన్న ధోరణి మాత్రమే కనిపిస్తుంది. ప్రజలకు ఏం పని? పనీ పడి గెలిపించుకుని నెత్తిన పెట్టుకుని ఊరేగడానికి? అన్న స్పురణలో ఉండరు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ఏ రీతిన బాగుపడుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story