Wed Jan 08 2025 16:00:21 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తపల్లి తప్ప వైసీపీకి ఎవరు దొరకలేదా?
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికార పార్టీ పాలనపూర్తవుతున్న సమయంలో ఇది మామూలే
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి పాలనపూర్తవుతున్న సమయంలో ఇది షరా మామూలే. అధినేతలు కూడా పెద్దగా పట్టించుకోరు. తమను ఇన్నాళ్లూ పట్టించుకోలేదని, తాము అనుకున్న పదవులు రాలేదని కొందరు, తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇన్నాళ్లూ హైకమాండ్ నియోజకవర్గంలోని వైరి వర్గానికి సహకరిస్తుందని కొందరు. తనకు పోటీగా మరొకరిని పార్టీ ప్రోత్సహిస్తుందని భావించిన మరికొందరు ఇలా... ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అసంతృప్త నేతలు బయటపడుతూనే ఉంటారు. వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలనుకుంటే అధినాయకత్వం బుజ్జగించిం పంపుతుంది. లేదంటే కొన్నాళ్లు చూసీ చూడనట్లు వదిలేస్తుంది.
ఎంపీగా ఉండి...
వీరిలో ఇంకో కేటగిరీ కూడా ఉన్నారు. వారు తాము చెప్పిందే హైకమాండ్ చేయాలనుకుంటారు. అలాంటి వారిలో రఘురామ కృష్ణరాజు ఒకరు. వైసీపీ ఎంపీగా గెలిచినా గడచిన మూడేళ్ల నుంచి పార్టీ పై ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎంపీ కావడంతో ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మరింత రెచ్చి పోతారని భావించి అలా చూస్తూ వదిలేసింది. రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసి రెండేళ్లవుతున్నా అతీలేదు గతీలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకూ అది తెగేది కాదు. తేలేది కాదు. కొన్నాళ్లు ఆయన చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చే వైసీపీ నేతలు కొన్నాళ్ల తర్వాత వదిలేశారు. ఆయనపై స్థానికంగా పోలీసు కేసులు నమోదు చేసి స్వంత నియోజకవర్గానికి రాకుండా మాత్రం వైసీపీ కట్టడి చేయగలిగింది. ఆయనను ఢిల్లీకే పరిమితం చేయగలడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అయింది.
డీఎల్ పై నో కామెంట్స్...
ఇక మధ్యలో ఎలాంటి పదవులు లేకపోయినా, పార్టీలో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిలో డీఎల్ రవీంద్రారెడ్డి ఒకరు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న అక్కసు. తనను పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసిందన్న కోపంతో జగన్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. చంద్రబాబును మించి ఈరాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని కూడా డీఎల్ అన్నారు. జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు ఓట్లేస్తారని ఆయన ప్రశ్నించారు. అసలు డీఎల్ పార్టీలో ఉన్నారా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు. 2019 ఎన్నికలకు ముందు మాత్రం చంద్రబాబును విమర్శించిన డీఎల్ రవీంద్రారెడ్డికి జగన్ పార్టీ కండువా కప్పారు. కానీ డీఎల్ పై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
కొత్తపల్లిపై మాత్రం వేటు...
ఇక కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన కూడా ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చారు. ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. కానీ భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనల్లో పాల్గొన్నారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించలేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముదునూరిపై విమర్శలు చేసి తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. కొత్తపల్లి వ్యవహారశైలిపై నివేదికను తెప్పించుకున్న పార్టీ నాయకత్వం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన పార్టీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోగా ఇతర పార్టీల్లో చేరేందుకే ఆయన సమయం గడుపుతున్నారు. ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు.
ఆనంను ఏం చేస్తారో?
ఇక ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే. ఆయన కూడా గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరి వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రి పదవి కోసం ఎదురు చూసినా ఫలితం లేదు. వైసీపీలో తనకు భవిష్యత్ లేదని భావించారో? ఇక పార్టీలో ఉంటే మరోసారి తనకు సీటు ఇవ్వరని అనుకున్నారో? తెలియదు కాని కొంతకాలం నుంచి పార్టీపైన, ప్రభుత్వంపైన బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఆయనపై వేటు వేయాలని అధినాయకత్వం నిర్ణయించిందన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేటు పడ్డ తొలి ఎమ్మెల్యేగా ఆయన ముద్ర పడిపోతారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీ పరంగా ఆనంపై చర్యలు తీసుకోవచ్చు. లేదంటే ఆయనను మరింత హ్యుమిలేట్ చేయడానికి వెంకటగిరి ఇన్ఛార్జిని నియమించవచ్చు. అలా ఇన్ఛార్జిని నియమిస్తే ఆయనంతట ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు. లేదంటే పార్టీ, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తగ్గించవచ్చు. చివరకు నేదురుమిల్లిని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా అధినాయకత్వం నియమించింది. మరి ఆనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
- Tags
- ysrcp
- differences
Next Story