Mon Dec 23 2024 17:29:55 GMT+0000 (Coordinated Universal Time)
లెక్కలు తప్పాయి.. లోపం ఎక్కడ?
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ అధినేతకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ కు షాకింగ్ అని చెప్పాలి
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైసీపీ అధినేతకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ కు షాకింగ్ అని చెప్పాలి. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఏం జరిగింది? లోపం ఎక్కడ? వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. సమన్వయ లోపం, అతి విశ్వాసమే కారణమన్న అభిప్రాయం చాలా మంది నేతల్లో వ్యక్తమవుతుంది. ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని భావించిన వైసీపీ నేతలు ఆ ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. వామపక్ష పార్టీ అభ్యర్థులను దెబ్బకొట్టాలని భావించి ఆ ఎన్నికలపైనే సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేశారు. దీనికి తోడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను గాలికి వదిలేశారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.
నిర్లక్ష్యానికి మూల్యం...
ఎటూ ఉత్తరాంధ్ర, రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ బలంగా ఉన్న తమ పార్టీకి ఎదురులేదని భావించారు. మంత్రులు కూడా నాలుగు గోడల మధ్యనే ఉండి కిందిస్థాయి నేతలకు బాధ్యతలను అప్పగించారు. ఫలితం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిలో పరాభవాన్ని చూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు అంత ఆషామాషీగా జరిగినవి కావు. ప్రత్యర్థుల బలాన్ని కూడా తక్కువగా అంచనా వేశారు. ఇప్పటి వరకూ స్థానిక సంస్థల నుంచి అన్ని ఎన్నికల్లో ప్రజలు తమ పక్షాన నిలబడటంతో ఈ ఎన్నిక కూడా కష్టపడకుండానే గెలుచుకోవచ్చన్న నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోని పరిస్థితి ఏర్పడింది.
లెక్కలు తప్పాయా?
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జగన్ కూడా మంత్రులకు బాధ్యత అప్పగించారు. అభ్యర్థులను జగన్ కొన్ని నెలలు ముందుగానే ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పీకే టీం వంటి సంస్థలు కూడా సర్వేలు ఇవ్వలేదనిపిస్తుంది. బిందాస్ గా ఉన్నారు. సామాజిక సమీకరణాలు కూడా పనిచేయలేదు. మంత్రివర్గ విస్తరణలోనూ, ఎమ్మెల్సీల ఎంపికలోనూ జగన్ కులాల వారీగా లెక్కలు వేసుకుని మరీ ఏరి ఏరి ఇచ్చారు. మంత్రుల ఎంపిక కూడా సరిగా లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా ఆ ఫలితం మాత్రం ఈ ఎన్నికల్లో కన్పించకపోవడంతో వైసీపీ నేతలు డీలా పడ్డారు. అసలు ఏం జరిగిందన్న దానిపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉంది. ఆత్మ పరిశోధన చేసుకోవాల్సి ఉంటుంది.
ఆత్మశోధన అవసరం...
లేకుంటే వచ్చే ఎన్నికలు కూడా పుట్టి ముంచడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్షేమ పథకాలు, సామాజికవర్గాల సమీకరణలు తనను మరోసారి అందలం ఎక్కిస్తాయనుకుంటే రివర్స్ రిజల్ట్ రావడం ఖాయమని అర్ధమవుతుంది. ఏ నేత మరొక నేతను నమ్మరు. జగన్ ఎవరిని దగ్గరకు తీసినా మరొక నేతకు భయం. అధినేత వద్ద నిజం చెప్పే సాహసం చేయలేని నైజం ఉన్న నేతలు మంత్రులయ్యారు. ఇక ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సమన్వయం చేసుకోలేదనే అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఇప్పటికైనా అన్ని రకాలుగా మేలుకోకపోతే జగన్ ఒక్క ఛాన్స్ నినాదానికే మిగిలిపోవాల్సి ఉంది. మరోసారి ఛాన్స్ ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని ఈ ఫలితాల ద్వారా గ్రహించి మారితే కొంత అనుకూలం ఉంటుంది. లేకుంటే లేదు. అది ఆయన ఇష్టం. టోటల్ గా వాస్తవం ఏంటంటే... టీడీపీ గెలిచింది. వైసీపీ ఓడింది.
Next Story