Sat Nov 23 2024 02:45:14 GMT+0000 (Coordinated Universal Time)
అసద్ అక్కడకు వెళ్లి పాగా వేస్తారా?
అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక సార్లు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించారు.
అసదుద్దీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక సార్లు ఆయన ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించారు. కొన్ని పార్టీలతో పాత్తు పెట్టుకుని రానున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అసద్ ఇప్పటికే నిర్ణయించారు. వంద స్థానాల్లో ఎంఐఎం ఉత్తర్ ప్రదేశ్ లో పోటీ చేయనుంది. కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకోవడం లేదు. ఉత్తర్ ప్రదేశ్ లో తమ సత్తా చాటాలన్నదే ఆయన ఉద్దేశ్యంగా కన్పిస్తుంది.
అనేక రాష్ట్రాల్లో....
ఎంఐఎం హైదరాబాద్ కే పరిమితమైన పార్టీ కాదని అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే నిరూపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీకి ముందుంటున్నారు. బీహార్ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ సక్సెస్ అయ్యారు. అక్కడ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానివ్వకుండా అసద్ ఉపయోగపడ్డారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోటీ చేసినా అసదుద్దీన్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు.
ఉత్తర్ ప్రదేశ్ లో....
మహారాష్ట్రలో మాత్రం కొన్ని స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలిచి శాసనసభలోకి అడుగు పెట్టారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటగలిగింది. ఇదే పంధాలో ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో కూడా పార్టీని విస్తరించాలనిఅసదుద్దీన్ పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే వంద స్థానాల్లో పోటీ చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి.
వంద స్థానాల్లో....
ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లిం సామాజికవర్గం ఎక్కువగానే ఉంది. దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో వారు ప్రభావం చూపుతారు. గెలుపోటములను శాసిస్తారు. అందుకోసమే ముస్లిం ఓటుబ్యాంకును తన వైపునకు తిప్పుకునే లక్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్ అసదుద్దీన్ సభలు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ కాంగ్రెస్, ఎస్పీకి అనుకూలంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు ఈసారి తన వైపునకు తిప్పుకోవాలన్న అసద్ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాలి.
Next Story