శ్రీనివాస్ వద్ద ఉన్న లేఖలో ఏముంది?
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. ‘‘12 గంటలకు జగన్ వీఐపీ లాంజ్ కు వచ్చారు. అక్కడి సర్వర్ అందరికీ టీ ఇచ్చాడు. 12.30 గంటలకు మళ్లీ కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత ముమ్మడివరం మండలం తానాయలంకకు చెందిన జానేపల్లి శ్రీనివాసరావు అనే సర్వర్ సెల్ఫీ కోసం జగన్ ను అడిగాడు. ఎడమ చేతితో ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ కుడి చేత్తో జేబులో నుంచి కత్తి తీశాడు. కత్తితో జగన్ ఎడమ చేతి మీద దాడి చేశాడు. వెంటనే అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ దినేశ్ కుమార్ స్పందించారు. అలాగే జగన్ గన్ మెన్ లు అతడిని పట్టుకుని సీఐఎస్ఎఫ్ అధికారులకు అప్పగించానే. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
జేబులో పది పేజీల లేఖ.....
విచారణలో అన్నీ బయటకు వస్తాయి. జగన్ కు ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాక విమానంలో హైదరాబాద్ వెళ్లిపోయారు.శ్రీనివాసరావు జేబులో పది పేజీల లేఖ ఉన్నట్లు గుర్తించాం. దాడికి కారణాలేమిటో విచారిస్తాం. ఈ ఘటన పబ్లిసిటీ కోసమే అనిపిస్తోంది. ఎయిర్ పోర్టులో ఘటన జరిగింది కాబట్టి సీఐఎస్ఎఫ్ పూర్తి బాధ్యత తీసుకోవాలి.కత్తి ఎయిర్ పోర్టు లోపలకు ఎలా వెళ్లిందో సీఐఎస్ఎఫ్ వారిని అడుగుతున్నాం. మేం ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తున్నాం. శ్రీనివాసరావు ఏడాదిగా ఫ్యూజన్ రెస్టారెంటులో పని చేస్తున్నాడు. అతడు జగన్ ఫ్యాన్ ని అని చెబుతున్నాడు. సీఐఎస్ఎఫ్ వాళ్ల నుంచి లేఖ తీసుకున్నాం. అవసరమైతే భద్రత కచ్చితంగా పెంచుతాం’’ అని ఏపీ డీజీపీ పేర్కొన్నారు.