Wed Nov 20 2024 08:44:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై ఆ ప్రచారాలు అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చేతకాని సీఎంగా చిత్రీకరించాలన్న ప్రయత్నం బాగానే జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చేతకాని సీఎంగా చిత్రీకరించాలన్న ప్రయత్నం బాగానే జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పాటు అనుకూల మీడియా కూడా జగన్ కు పాలన చేతకాదని నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతకు ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రం పచ్చగా ఉన్నట్లు, అసలు ఆయన అప్పులే చేయనట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పడు తాజాగా మూడు రాజధానుల చట్టాలను వెనక్కు తీసుకోవడం కూడా జగన్ చేతకానితనంగానే ప్రచారం చేస్తుంది.
చేతకాని ముఖ్యమంత్రిగా....
చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఒకటే భావిస్తున్నారు. చంద్రబాబుకు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎవరికీ లేదన్నది వారి భావన. చంద్రబాబు సీనియారిటీయే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనించేలా చేస్తుందని ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తప్ప ఏమీ లేవంటోంది. చంద్రబాబు కూడా లక్ష కోట్ల కు పైగానే అప్పులు చేసిన విషయాన్ని విస్మరించి మరీ విమర్శలు చేస్తుంది.
పథకాలు ఆగిపోవాలని...
మరోవైపు జగన్ అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలను నడుపుతుండటంతో, అప్పులు ఎక్కడా పుట్టనీయకుండా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పులు పుట్టకపోతే జగన్ పథకాలను కొనసాగించలేరు తద్వారా తాము లబ్ది పొందవచ్చన్నది టీడీపీ నేతల ఆలోచన. అందుకే ప్రతి పనికీ కిరికిరి పెడుతున్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన 25 వేల కోట్ల బకాయీలను చెల్లించాలని ఈఆర్సీ రాసిన లేఖలను బయటపెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తాము చెప్పినట్లే...
ముఖ్యమంత్రి జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ కాదని, తాము చెప్పినట్లే చేయాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుండటం విడ్డూరంగా ఉంది. ఎయిడెడ్ స్కూళ్ల పై ప్రభుత్వం విడుదల చేసిన జీవోయే ఇందుకు ఉదాహరణ. దీనిపై టీడీపీతో సహా అనుకూల మీడియా యాగీయాగీ చేసింది. జగన్ మరికొంత కాలం ముఖ్యమంత్రి గా ఉంటే రాష్ట్ర సర్వనాశనం అవుతుందన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపే ప్రయత్నం చేస్తుంది. మూడు రాజధానులపై రెండున్నరేళ్లు నాన్చి ఎక్కడా అభివృద్ధి చేయకుండా జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో కూడా విమర్శిస్తున్నారు. మొత్తం మీద జగన్ ను చేతకానివాడిగా చిత్రీకరించాలన్న విపక్ష పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది.
Next Story