Mon Dec 23 2024 08:58:41 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పైనే నమ్మకం? పవన్ కు ఆ ప్రామిస్?
బీజేపీ కేంద్ర నాయకత్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ విషయంలో స్పష్టమైన వైఖరితోనే ఉన్నట్లు కనపడుతుంది. జగన్ ను నమ్ముతున్నట్లే ఉంది.
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ విషయంలో స్పష్టమైన వైఖరితోనే ఉన్నట్లు కనపడుతుంది. జగన్ ను నమ్ముతున్నట్లే ఉంది. పవన్ కల్యాణ్ కు ఈ మేరకు సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. టీడీపీతో కలిసి ప్రయాణం చేసే ప్రసక్తి లేదని కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయపడుతుంది. తమకు నమ్మకమైన స్నేహితుడు కావాలని, అవసరాల కోసం వదులుకునే చంద్రబాబు లాంటి వ్యక్తి కాదని పవన్ కల్యాణ్ కు తెగేసి చెప్పేటట్లే కనపడుతుంది.
రూట్ మ్యాప్ ఇదే...
పవన్ కల్యాణ్ కు బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఇవ్వాలనుకుంటుంది. అది కేవలం జనసేన, బీజేపీ లు మాత్రమే పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని ఆయనకు త్వరలోనే తెలియజేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయం ఎన్నికల అనంతరం చర్చిద్దామని, ఏ రాష్ట్రంలోనూ తాము సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించబోమని పవన్ కల్యాణ్ కు బీజేపీ తెలియజేయనున్నట్లు తెలిసింది. అయితే పవన్ కల్యాణ్ కు కొన్ని హామీలు ఇచ్చేందుకు మాత్రం కేంద్ర నాయకత్వం సిద్ధమయిందని తెలిసింది.
బాబును నమ్మే....
2029 నాటికి ఏపీ రాజకీయ పరిస్థితులు మారతాయని, దానిని అంచనా వేసుకుని ఆలోచించుకోవాలని కూడా బీజేపీ నాయకత్వం పవన్ కు చెప్పనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నది వారి వాదన. ఇప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నప్పటికీ అది చంద్రబాబు నైజం అని, చంద్రబాబును నమ్మడం వేస్ట్ అని పవన్ కు కేంద్ర నాయకత్వం హితబోధ చేసే అవకాశమూ లేకపోలేదు.
అన్నిరకాలుగా...
2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా అన్ని రకాలుగా పార్టీకి అండదండలుంటాయని బీజేపీ పెద్దలు పవన్ కు హామీ ఇవ్వనున్నారని సమాచారం. ఆర్థికంగానే కాకుండా కేంద్రంలో కూడా అవసరమైతే అవకాశం కల్పిస్తామని కూడా పవన్ కు స్పష్టమైన హామీ ఇస్తారని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోయన్న సందేహం నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్ నే బీజేపీ పెద్దలు నమ్ముకుంటారన్నది హస్తిన నుంచి వినపడుతున్న టాక్.
Next Story