Fri Nov 22 2024 16:56:34 GMT+0000 (Coordinated Universal Time)
కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
కరీంనగర్ సభలో బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై నమ్మకంతోనే రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిందన్నారు
కరీంనగర్ సభలో బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై నమ్మకంతోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం నియమించిందన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింపు సభలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. తాను కరీంనగర్ లో ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని అని అన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అయింది కేవలం కార్యకర్తల వల్లనేనని అన్నారు. తనకు గెలుపు ముఖ్యం కాదని, హిందూ ధర్మం కోసమే తాను గెలవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కాషాయజెండా ఎగరడం ఖాయం...
తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని అన్నారు. బీఆర్ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అని అన్నారు. మహిషాలో ప్రారంభించిన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానని బండి సంజయ్ అన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురి చేశారన్నారు. మహిషాలో తాను ప్రారంభించిన యాత్రను కరీంనగర్ గడ్డ మీద ముగించానని ఆయన చెప్పారు. ధర్మం కోసం తాను యుద్ధం చేస్తానని బండి సంజయ్ తెలిపారు. తనకు డిపాజిట్ రాదంటూ కొందరు హేళన చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఏపీ, తెలంగాణ సీఎంలు ఒక్కటే...
ధనిక తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ధరణి పేరుతో దోపిడీ మొదలయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ సీఎం, ఏపీ ముఖ్యమంత్రి ఒక్కటేనని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు దారి మళ్లిస్తున్నారని ఆయన అన్నారు.ఇక్కడ టీఆర్ఎస్ దుకాణం బంద్ చేసి ఢిల్లీలో కొత్త దుకాణం తెరిచానని అన్నారు. మోదీని ఎదుర్కొనేందుకు గుంటనక్కలన్నీ ఒక్కటవుతున్నాయని బండి సంజయ్ అన్నారు. ఈ కార్కక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story