Mon Dec 23 2024 07:35:59 GMT+0000 (Coordinated Universal Time)
సంజయ్ హీరో.. అందరినీ వెనక్కు నెట్టేశారా?
కార్పొరేటర్ పదవి నుంచి ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన బండి సంజయ్ అనతి కాలంలోనే పార్టీ హైకమాండ్ దృష్టిిలో పడ్డారు
బండి సంజయ్ .. అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. కరీంనగర్ లో కార్పొరేటర్ పదవి నుంచి ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన బండి సంజయ్ అనతి కాలంలోనే పార్టీ హైకమాండ్ దృష్టిిలో పడ్డారు. 2019 ఎన్నికల నాటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పెద్దగా పట్టులేదు. అంటే అప్పటి రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వాన్ని తప్పు పట్టడం కాదు. ఒక్కో నేతదీ ఒక్కో స్టయిల్. గతంలో పార్టీ నేతలు సాఫ్ట్ గా ఉండేవారు. వారి ప్రసంగాల్లోనూ, వ్యవహారశైలిలోనూ సున్నితత్వం కనిపించేంది.
రాష్ట్ర అధ్యక్షుడిగా....
కానీ బండి సంజయ్ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత పార్టీలో ఊపు పెరిగింది. కార్యకర్తల్లో జోష్ పెరిగింది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 119 నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. 119 శాసనసభ ఎన్నికల్లో దాదాపు 107 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. దీంతో బూత్ లెవెల్ కార్యకర్తలపై ఆయన ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని ప్రోత్సహించారు. బీజేపీలో ఉంటే భవిష్యత్ ఉంటుందని భరోసాను కల్పించారు. సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సంజయ్ సక్సెస్ అయ్యారు. భాగ్యలక్ష్మి టెంపుల్, ఎంఐఎం, టీఆర్ఎస్ పై విరుచుకుపడటం ఆయనకు కలసి వచ్చాయి.
గ్రిప్ దొరికడం...
దీంతో తెలంగాణలో కొంత పార్టీకి గ్రిప్ ఇటీవల కాలంలో దొరికింది. కాంగ్రెస్ పార్టీ గ్రూపులతో కొట్లాడుకోవడం, ఆ పార్టీ క్యాడర్ లో నైరాశ్యం నెలకొనడాన్ని సంజయ్ తనకు అనుకూలంగా మలచుకోగలిగారు. పటిష్టమైన నాయకత్వం కోసం ఆయన ప్రయత్నించారు. కొంతవరకూ ఫలించాయి. సంజయ్ కృషితో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చింది. శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికి పరిమితమైన బీజేపీ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని గెలుచుకుంది. అక్కడ పోటీ చేసిన అభ్యర్థులే కారణమయినా ఆ విజయాలు మాత్రం బండి ఖాతాలో పడ్డాయి. దుబ్బాక, హుజారాబాద్ ఎన్నికల్లో గెలవడంతో ప్రధాని మోదీ సయితం సంజయ్ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
పాదయాత్రతో...
అలాగే బండి సంజయ్ ఇక వెనుదిరిగి చూడలేదు. పాదయాత్రతో మరింత జోష్ పెంచారు. దశల వారీగా నిర్వహించినా ఆయన పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా హాజరయ్యారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభ సంజయ్ ఇమేజ్ ను మరింత పెంచాయి. కార్యవర్గ సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనసమీకరణ చేయడంతో మోదీ దృష్టిలో మరోసారి సంజయ్ పడ్డారు. మోదీ సభకు వచ్చిన ప్రజలను చూసి సంజయ్ భుజం తట్టారంటే ఆయన ఎంత సంతృప్తి చెందిందీ వేరే చెప్పాల్సిన పనిలేదు.
హైకమాండ్ కు...
ఇప్పుడు తెలంగాణలో పార్టీ హైకమాండ్ కు మొదట విన్పించే కన్పించేది బండి సంజయ్ నే. అయితే సంజయ్ శ్రమతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్ వ్యూహం కూడా ఉంది. బండి సంజయ్ పాదయాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలను తరుణుచుగ్ చూసుకుంటున్నారు. సంజయ్ వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్నారు. అయితే వీటన్నింటికీ వచ్చే శాసనసభ ఎన్నికల ఫలితాలే నిజమైన సమాధానం చెబుతాయన్నది వాస్తవం. పార్టీ నిజంగా బలోపేతమయిందా? లేదా? అన్నది తేల్చేది ఎన్నికలే. కానీ అప్పటి వరకూ పార్టీ హైకమాండ్ దృష్టిలో సంజయ్ నే హీరో. ఇందులో వేరే ఆలోచనలకు తావులేదు.
Next Story