Sat Nov 23 2024 09:11:48 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో ఏడుగురిలో ఎవరా రెడ్డి?
2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ఖాయమయింది. ముహూర్తం ఎప్పుడు అన్నదే తేలాల్సి ఉంది. అయితే సీనియర్ నేతలు అనేక మంది మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆయనలో కొంత ఆశలు పెరిగాయి. రెడ్డి సామాజికవర్గం కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు.
మొన్నటి ఎన్నికలకు ముందే....
2019 ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. సుదీర్ఘకాలం ఆనం కుటుంబం రాజకీయాల్లో అనేక పదవులు పొందుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. అయితే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆనం కుటుంబం కాంగ్రెస్ లోనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరింది.
ఆశావహులు అనేకమంది....
నెల్లూరులో అనేక మంది మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి పదవి పై గట్ట ిఆశలు పెట్టుకున్నారు. అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి సయితం మంత్రి పదవి తనకే దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది ఎన్నికల టీం కావడంతో జిల్లా నేతలను సమన్వయం చేసుకునే నేతను మంత్రిగా నియమించాలని జగన్ భావిస్తున్నారు.
ఏడుగురు రెడ్లే...
ఆనం కుటుంబంతో నెల్లూరు జిల్లా నేతలకు పొసగదు. ఆయన రాజకీయం అంతా వన్ సైడ్ ఉంటుందన్నది వైసీపీ ఎమ్మెల్యేలే అంతర్గత సంభాషణల్లో ఆరోపిస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనంకు వ్యతిరేకంగా ఉన్నారు. వీఆర్ కళాశాల వ్యవహారంలో వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో పది నియోజవర్గాలుండగా అందులో ఏడింటిలో రెడ్డి సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో సింహభాగం ఆనంను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డికి ఈసారి కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదంటున్నారు.
Next Story