Mon Dec 23 2024 02:28:38 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పుడు.. ఇక్కడ.. ఏం చేస్తావు తల్లీ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జయప్రదను క్రియాశీలకంగా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తుంది
సినిమాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జయప్రద ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జయప్రదను క్రియాశీలకంగా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తుంది. జయప్రద తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వదిలేసి దశాబ్దాలు దాటింది. బాలీవుడ్ లో సినీ ప్రస్థానం ముగిసిన తర్వాత ఉత్తరాది రాజకీయాలకే పరిమితమయింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆ తర్వాత బీజేపీలో చేరారు జయప్రద.
టీడీపీలో .....
జయప్రద తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994లో జయప్రద టీడీపీలో చేరారు. పార్టీ మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అనంతరం టీడీపీ నేతలతో పడక ఆమె ఉత్తరాది రాజకీయాలవైపు మొగ్గు చూపారు. సమాజ్ వాదీ పార్టీలో చేరి 2004లో రాంపూర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీలోనూ పొసగక కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు.
క్రియాశీలకంగా....
జయప్రద స్వస్థలం రాజమండ్రి. అందుకే ఆమె బీజీపీ రాజమండ్రిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆమెను రాష్ట్ర పార్టీలో క్రియాశీలకంగా చేయాలని నేతలు భావిస్తున్నారు. గ్లామర్ తో కొన్ని ఓట్లు అయినా రాబట్టుకోవచ్చన్నది కమలనాధుల ఆలోచనగా ఉంది. ముఖ్యంగా ప్రచారానికి జయప్రద సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తుంది. జయప్రద కూడా అందుకు సమ్మతించినట్లు తెలిసింది.
భిన్నాభిప్రాయాలు...
అయితే జయప్రద వల్ల ఒరిగేదేం ఉందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. జయప్రద ఇప్పటి జనరేషన్ కు కనెక్ట్ కారు. ఆమె వల్ల ఉపయోగం లేదని అనేవారు లేకపోలేదు. జయప్రద దశాబ్దకాలం రాష్ట్రం విడిచి వెళ్లి ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ఓటేసే వారు ఎవరు? అన్న ప్రశ్న పార్టీలోని యువనేతలే ప్రశ్నిస్తున్నారు. జయప్రద ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ఊడబెరికేదేమీ లేదని, వేదికపై ఒక కుర్చీ వేస్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. రాజమండ్రి కాబట్టి ఆమెను ఆహ్వానించడంలో తప్పులేదని, ఏపీ బీజేపీలో నేతగా ఆమెను రప్పించడం వేస్ట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద జయప్రద ఏపీ పాలిటిక్స్ లో తిరిగి రాణిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story