Sat Dec 21 2024 00:20:45 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో "త్రిపుర" వ్యూహం
త్రిపుర తరహా వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు పరుస్తున్నట్లే కనపడుతుంది.
త్రిపుర కొన్ని దశాబ్దాల పాటు కమ్యునిస్టుల కంచుకోటగా ఉండేది. అటువంటి చోట బీజేపీ పాదం మోపింది. త్రిపురలో ఓటమి పాలయిన తర్వాత అప్పుటి ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఒక వ్యాఖ్య చేశారు. గత కొద్ది నెలలుగా రాష్ట్రాన్ని ఆర్థిక దిగ్భంధనం చేసిందని, రాష్ట్రంలో ఆర్థిక అలజడి సృష్టించి బీజేపీ ఎదుగుదలకు ప్రయత్నించిందని ఆయన కామెంట్ చేశారు. ఇప్పుడు త్రిపుర తరహా వ్యూహాన్ని తెలంగాణలో బీజేపీ అమలు పరుస్తున్నట్లే కనపడుతుంది.
తెలంగాణలో చోటు...
రెండు దఫాలుగా తెలంగాణను తెచ్చిన కేసీఆర్ విజయం సాధించి పట్టు బిగించారు. మిగిలిన పార్టీలను నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ నేతలను కూడా తమ పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని ఇబ్బందుల పాలు చేశారు. కానీ బీజేపీ ఎదుగుదలను మాత్రం ఆపలేకపోయారు. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారు. దుబ్బాకను సెంటిమెంట్ తో కూడా చేజిక్కించుకోలేకపోయారు. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు తెలంగాణలో దక్కాయి. దీంతో బీజేపీ తెలంగాణలో తమకు చోటు ఉందని భావించింది.
ఆర్థిక దిగ్భంధనానికి...
అందుకే కొన్ని నెలల నుంచి తెలంగాణను ఆర్థిక దిగ్భంధనానికి గురి చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో 25 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. పనులు చేసిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లింపు కూడా పదిహేను రోజుల పాటు ఆలస్యమవుతుంది. ఇక పింఛన్లు అయితే నెల రోజుల పాటు పెండింగ్ లో పెట్టేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుులు పుట్టకపోవడమే కారణం. ధాన్యం సేకరణ జరిపి నెల గడుస్తున్నా ఇంకా రైతులకు రూ.500 కోట్లు ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. దీనిపై వివిధ వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. బీజేపీకి కావాల్సింది అదే.
అప్పుల కోసం వేట...
అప్పులపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుంది. ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటి అప్పులు చేయడానికి అనుమతి ఇవ్వడం లేదు. దీతో పాటు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన 7,800 కోట్లు రావాల్సి ఉంది. సెస్సుల పేరుతో 11 శాతం నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఇప్పుడు అప్పుల వేటలో తెలంగాణ సర్కార్ ఉంది. హైదరాబాద్ లో విలువైన స్థలాలను విక్రయించడానికి సిద్ధమవుతుంది. విలువైన స్థలాలను గుర్తించాలని ఇప్పటికే ప్రభుత్వం సంబధిత శాఖలను ఆదేశించింది. దీంతో స్థలాలను విక్రయించి అయినా పథకాలను ఎన్నికల వరకూ కొనసాగించాలన్న ప్రయత్నంలో అధికార పార్టీ ఉన్నట్లు కనపడుతుంది.
Next Story