Mon Dec 23 2024 10:16:04 GMT+0000 (Coordinated Universal Time)
భీమ్లా నాయక్ రివ్యూ : పవర్ ప్యాక్డ్ బిగ్గెస్ట్ హిట్
పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "భీమ్లా నాయక్" సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే మార్నింగ్ షో లు ఎప్పటిలా కాకుండా..
పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "భీమ్లా నాయక్" సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ డే మార్నింగ్ షో లు ఎప్పటిలా కాకుండా.. కాస్త ముందే ప్రదర్శించారు. రివ్యూ కూడా వచ్చేసింది. మరి భీమ్లా నాయక్.. అందరినీ మెప్పించాడా ? కథేంటి ? సినిమా హిట్టేనా ? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమా - భీమ్లా నాయక్
నటీనటులు - పవన్ కల్యాణ్, రానా, నిత్యామీనన్, సంయుక్త మీనన్, సముద్రఖని, మురళీశర్మ, రావు రమేష్, తదితరులు
సంగీతం - తమన్
సినిమాటోగ్రఫీ - రవి కె. చంద్రన్
ఎడిటింగ్ - నవీన్ నూలి
స్క్రీన్ ప్లే, మాటలు - త్రివిక్రమ్
నిర్మాత - సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం - సాగర్ కె.చంద్ర
విడుదల - 25.02.2022
కథ
భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) కర్నూల్ జిల్లా హఠకేశ్వర్ మండలం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్ స్పెక్టర్. నిజాయతీ గల పోలీస్ అధికారి. డానియల్ శేఖర్ (దగ్గుబాటి రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్ అవుతాడు. అతను రాజకీయ పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఒక రోజు రాత్రి డానియల్ శేఖర్ కారులో మద్యం సీసాలతో అడవిగుండా వెళ్తూ అక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కుతాడు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లా నాయక్.. డానియల్ ను కొట్టి స్టేషన్ కు తీసుకెళ్తాడు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో డానియల్ శేఖర్ అహం దెబ్బతింటుంది. భీమ్లా నాయక్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావిస్తాడు. భీమ్లా ను దెబ్బతీసేందుకు డానియల్ ఏం చేశాడు ? భీమ్లా నాయక్ ఉద్యోగం ఎందుకు పోయింది ? ఒకరినొకరు చంపుకునేందుకు దారితీసిన పరిస్థితులేంటి ? ఆఖరికి గెలుపెవరిది ? తెలుసుకోవాలంటే.. పూర్తి సినిమా తెరపై చూడాల్సింది.
సినిమా ఎలా ఉందంటే..
ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బతింటే.. వారిద్దరి మధ్య వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయన్నదే "అయ్యప్పనుమ్ కోషియమ్" సినిమా. ఆ సినిమానే అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం అంటూ.. భీమ్లా నాయక్ గా తెలుగులో రీమేక్ అయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను.. మరో భాషలో రీమేక్ చేసి, దానిని హిట్ అయ్యేలా తెరకెక్కించడం మామూలు విషయం కాదు. మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న పవన్ కల్యాణ్ వంటి నటుడిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలియనిది కాదు. ఆ విషయంలో మాత్రం భీమ్లా టీమ్ విజయం సాధించిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్ నుంచి అభిమానులు ఏమి ఆశిస్తారో.. అవన్నీ మేళవించి సినిమాను తీర్చిదిద్దారు. త్రివిక్రమ్ రాసిన డైలాగులు ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేశాయి. భీమ్లా నాయక్ చెప్పే డైలాగులు అభిమానుల చేత సీటీలు వేయించాయి. ఇంటర్వెల్ ముందు ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు అభిమానుల్ని మరింత మెప్పిస్తాయి.
సెకండాఫ్ లో ఒరిజినల్ కంటెంట్ కన్నా.. మరిన్ని హంగులు జోడించి.. పవన్ మాస్ ఫాలోయింగ్ కు అనుగుణంగా సన్నివేశాలను చిత్రీకరించారు. భీమ్లా నాయక్ ఉద్యోగం పోవడానికి కారణమైన డానియల్ శేఖర్ తో భీమ్లా నాయక్ చేసే పోరాట సన్నివేశాలు మరింత ఉత్కంఠగా ఉంటాయి. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అందరినీ మెప్పిస్తుంది. బలమైన ఎమోషన్ తో సినిమా ముగిసే విధానం బాగుంటుంది. ఈ సినిమా టైటిల్ ను చూసి పవన్ కల్యాణ్ పాత్రను మాత్రమే ఎలివేట్ చేస్తారనుకున్నారు కానీ.. మాతృకలో మాదిరిగానే రానా పాత్రకు న్యాయం చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు.
ఎవరెలా చేశారంటే..
సినిమా చూశాక.. భీమ్లా నాయక్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం. పవన్ క్యారెక్టర్ లో అంత లీనమైపోయారు. నటించారు అనే కంటే.. జీవించారు అంటే బావుంటుందేమో. పవన్ చెప్పే డైలాగ్స్, విసిరే ఛాలెంజ్ లు పవన్ పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అభిమానులకైతే కన్నుల విందనే చెప్పాలి. డానియల్ శేఖర్ పాత్రలో రానా కూడా తన నటనతో మెప్పించాడు. రాజకీయంగా అండదండలున్న వ్యక్తి ఏ విధంగా అహంకారాన్ని ప్రదర్శిస్తాడో.. ఆ టెంపోను రానా చివరివరకూ కొనసాగించడం విశేషం. భీమ్లా నాయక్ భార్యగా నిత్యామీనన్ నటించింది. మాతృక తో పోలిస్తే.. ఇందులో హీరోయిన్ పరిధిని కాస్త పెంచారు. సీఐ కోదండరాం గా మురళీ శర్మ, డానియల్ శేఖర్ భార్యగా సంయుక్త మీనన్, అతని తండ్రిగా సముద్రఖని తమ పరిధి మేరకు నటించారు. సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం సినిమాలో తళుక్కున మెరిశారు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు అలరిస్తాయి. డైలాగ్స్ లో త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. మొత్తానికి యువదర్శకుడు సాగర్ కె. చంద్ర .. త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను అదేస్థాయిలో చూపించడంలో విజయం సాధించారు.
ప్లస్ పాయింట్స్
+ పవన్, రానాల నటన
+ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు
+ తమన్ సంగీతం, సాగర్ టేకింగ్
+ మైనస్ పాయింట్స్
ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు
మొత్తంమీద "భీమ్లా నాయక్" .. పవర్ ప్యాక్ట్ బిగ్గెస్ట్ హిట్
News Summary - Bheemla Nayak Review : Blistering performances by Pawan and Rana
Next Story