కేసీఆర్ పంతం నెరవేర్చిన హైకోర్టు
కాంగ్రెస్ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంలో ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. రెండు నెలల పాటు స్టే గడువును నిర్ణయించింది. గత అసెంబ్లీ సెషన్ లో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా చేసిన బహిష్కరణ చెల్లదని, వారిని వెంటనే ఎమ్మెల్యేలుగా గుర్తించాలని ఇంతకుముందు హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.
ఇక మళ్లీ గెలవాల్సిందే..!
అయితే, ఈ తీర్పును అమలు చేయని ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరుపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయడం లేదని ఎమ్మెల్యేలు సైతం కోర్టు దిక్కారణ పిటీషన్ వేసిన విషయం తెలిసింది. ఈ పిటీషన్ పై చరిత్రలోనే తొలిసారిగా కోర్టు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు పంపిన విషయం కూడా విధితమే. మొత్తానికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్ట నివ్వకూడదు అనుకున్న ముఖ్యమంత్రి పంతం నెరవేరేలా కనపడుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా కొనసాగే అవకాశం కనపడటం లేదు.