Sun Dec 22 2024 23:28:35 GMT+0000 (Coordinated Universal Time)
సేఫ్ గేమ్... మిషన్ మహారాష్ట్ర
బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజకీయ వ్యూహాన్ని మార్చింది. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది.
అందరి అంచనాలు తలకిందులయ్యాయి. అన్ని చోట్ల ఒక రకంగా.. మహారాష్ట్రలో మరొక రకంగా బీజేపీ వ్యవహరించింది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తన రాజకీయ వ్యూహాన్ని మార్చింది. ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది. షిండే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయిచింది. కొద్ది గంటల ముందు వరకూ దేవంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా అవుతారని అందరూ భావించారు. కానీ రెబల్స్ కే అవకాశమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. 106 మంది సభ్యులున్న బీజేపీ ఒక అడుగు వెనకడుగు వేసింది.
వ్యూహాత్మకంగానే...
బీజేపీ మహారాష్ట్రలో వ్యూహాత్మకంగానే నడుచుకుంటున్నట్లు కనపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికలకు ఇంకా రెండేళ్లు గడువు ఉంది. రెండేళ్ల కోసం ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని భావించినట్లుంది. షిండే ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపేందుకు బీజేపీ సిద్ధమయింది. తాము చెప్పినట్లు షిండే నడుచుకుంటారన్న విశ్వాసంతో ఉంది. ఈ రెండేళ్లలో శివసేనను మరింత బలహీనం చేయాలన్నది బీజేపీ వ్యూహంగా కన్పిస్తుంది. అందుకే బయట నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
అప్పుడే ఈ ప్రతిపాదన...
ఎన్నికలు జరిగినప్పుడే శివసేన ముఖ్యమంత్రి పదవి అడిగింది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా ప్రకారం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలని అప్పుడు శివసేన షరతు పెట్టింది. అందుకు అప్పుడు బీజేజీ అంగీకరించ లేదు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ససేమిరా అంది. ఫలితంగా శివసేన కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపింది. ఈ మూడేళ్లలో హిందుత్వ అజెండాను శివసేన పక్కన పెట్టిందన్న విమర్శలతో శివసేనలో అసంతృప్తిని రగులుస్తూ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరించని బీజేపీ ఈసారి ఒక అడుగు వెనక్కు వేసి ఆ పార్టీ రెబల్స్ కే అవకాశం కల్పించింది.
వచ్చే ఎన్నికల నాటికి...
ఇప్పుడు బీజేపీ మిషన్ అంతా వచ్చే ఎన్నికలపైనే. శివసేనను బలహీనపర్చడం, తాము మరింత బలోపేతం కావడం. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతోనే బీజేపీ ఇప్పుడు షిండేకు పగ్గాలు అప్పగించినట్లు స్పష్టంగా కనపడుతుంది. ఏదైనా వ్యతిరేకత ఉంటే అది ఎన్నికల్లో షిండే మీదకు పోతుంది. తాము సేఫ్ ప్లేస్ ఉంటామన్నది బీజేపీ గేమ్ ప్లాన్ గా కనపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి పదవిని వదులుకుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం కింగ్ మేకర్ పాత్రను బీజేపీ పోషిస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చివేసిందన్న అపవాదు రాకుండా ఉండేందుకు కూడా ఈ సేఫ్ గేమ్ ఆడినట్లు కన్పిస్తుంది.
Next Story