Fri Dec 20 2024 14:02:22 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ మ్యాజిక్.. రికార్డు బ్రేక్
గుజరాత్ ప్రజల్లోనూ, ప్రత్యర్థుల్లోనూ ఒకరకమైన వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేయగలిగింది
మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉంటే ఏ పార్టీకి అయినా ఎంతో కొంత నిరాశ ఉంటుంది. కానీ గుజరాత్ లో మాత్రం దీనికి భిన్నంగా చూస్తున్నాం. బీజేపీ పాలన పట్ల అక్కడి ప్రజలకు విసుగు అనేది లేకుండా ఉంది. మోదీకి ముందు.. తర్వాత అన్నట్లు గుజరాత్ ఎన్నికల పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇక్కడ బీజేపీ కంటే మోదీ మ్యానియా ఎక్కువగా పనిచేసిందనే చెబుతున్నారు. ఇన్నేళ్లు అధికారంలో ఉంటే సహంగా సీట్ల సంఖ్య తగ్గాలి. ఓట్ల శాతం కూడా కొంత తక్కువగా ఉండాలి. కానీ గుజరాత్ లో మాత్రం రాజకీయ పరిస్థితులను వేరుగా చూడాల్సి ఉంటుంది.
ఎటూ గెలిచేది బీజేపీయే కదా?
ప్రజల్లోనూ, ప్రత్యర్థుల్లోనూ ఒకరకమైన వాతావరణాన్ని బీజేపీ క్రియేట్ చేయగలిగింది. ఎటూ గెలిచేది బీజేపీయేనన్న భావన ప్రతి ఒక్కరిలో కలిగించడంలో కమలం పార్టీ సక్సెస్ అయింది. సమస్యలు, మూడ్, ఒపీనియన్లు ఇవేమీ కన్పించకుండా మోదీ మాయ గుజరాత్ ఎన్నికల్లో కనిపించిందనే చెప్పాలి. గెలిచే పార్టీకే ఓట్లు వేయడం బెటరన్న భావన ఓటర్లలో నెలకొల్పడంలో బీజేపీ సక్సెస్ అయింది. ప్రత్యర్థుల్లో కూడా అనవసరంగా ఖర్చు పెట్టడం ఎందుకు? ప్రయాసపడటం ఎందుకంత ఆలోచన ప్రత్యర్థుల్లో కూడా తొలి నుంచి కనిపించింది.
సిట్టింగ్ లను పక్కన పెట్టి...
క్షేత్రస్థాయిలో వేల మందిని ఇన్ఛార్జులను పెట్టారు. ప్రజల్లో అసంతృప్తి ఎక్కవుగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించారు. దాదాపు 48 మంది సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించారు. వీరిలో మంత్రులు కూడా ఉండటం విశేషం.19 మంది రెబల్స్ పోటీ చేశారు. అయినా బీజేపీ గుజరాత్ లో తట్టుకుని ఏడో సారి ఏకపక్షంగా విజయం సాధించింది. 1995లో ఒకసారి 121 స్థానాలను సాధించిన బీజేపీ తర్వాత అత్యధికంగా 150 స్థానాలకు పైగా సాధించడం ఈసారి రికార్డు అనే చెప్పాలి. అంతేకాదు ఏడుసార్లు గెలిచి పశ్చిమబెంగాల్ లో కమ్యునిస్టు పార్టీలు నెలకొల్పిన రికార్డును కూడా సమం చేసింది. ఇక్కడ బీజేపీని చూడలేదు. అభ్యర్థి ఓటర్లకు కన్పించలేదు. కేవలం మోదీ మాత్రమే కన్పించారు.
మోదీ మాయ...
గుజరాత్ లో మోదీ ఓటమి పాలయితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆయన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని ప్రజలు భావించారంటున్నారు. ఇక్కడ గెలిస్తే తిరిగి మోదీని ప్రధాని అభ్యర్థిగా కూడా బీజేపీ ప్రకటిస్తుందన్న సెంటిమెంట్ కూడా పనిచేసిందంటున్నారు. అన్ని రకాలుగా సెంటిమెంట్ ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ శ్రేణుల శ్రమను మరిచిపోలేం. ప్రధాని మోదీ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకూ విజయం కోసం కృషి చేశారు. రెండు కోట్ల మందిని నేరుగా కలిసేలా ఏర్పాటు చేసుకుంది ఆ పార్టీ. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో 31 చోట్ల ప్రధాని మోదీ ర్యాలీలు నిర్వహించారు. అహ్మదాబాద్ లో నలభై కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించి రికార్డు బ్రేక్ చేశారు. మొత్తం మీద గుజరాత్ లో మోదీ మ్యాజిక్ పనిచేసింది. మోదీ వల్లనే బీజేపీకి రికార్డు స్థాయి విజయం లభించిందనడంలో సందేహం లేదు.
Next Story