Mon Jan 06 2025 16:00:03 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా అర్థం కాకపోతే ఎలా?
బీజేపీకి పోయేది లేదు.. వచ్చేది లేదు. ఒంటరిగా పోటీ చేసినా నష్టం లేదు. అలాగని పొత్తులతో బరిలోకి దిగినా ప్రాబ్లం లేదు
బీజేపీకి పోయేది లేదు.. వచ్చేది లేదు. ఒంటరిగా పోటీ చేసినా నష్టం లేదు. అలాగని పొత్తులతో బరిలోకి దిగినా ప్రాబ్లం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలిచినా తిరిగి కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చే వారే. ఆ విషయం కేంద్ర నాయకత్వానికి తెలియంది కాదు. పార్టీని బలోపేతం చేసుకోవాలన్నా, ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నా, క్షేత్రస్థాయిలో నేతలను రూపొందించుకోవాలన్నా ఒంటరిగా పోటీ చేయడమే కమలం పార్టీకి బెటర్. గత ఎన్నికల్లో నోటా కంటే ఓట్ల శాతం తక్కువగా వచ్చింది. అయితే ఏం నష్టం జరిగింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ బీజేపీతో పొత్తు ఉన్న పార్టీలాగే వ్యవహరిస్తుంది.
ఎవరు గెలిచినా...?
అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి గెలిచినా ఆ పరిస్థితుల్లో మార్పు ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఎలాంటి అభివృద్ధి జరగదు. నిధుల కోసమైనా, కొన్ని ఆర్థిక వెసులుబాటుకైనా తమను ఆశ్రయించాల్సిందేనన్న నమ్మకం బీజేపీ పెద్దలది. మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు ఏపీలో బీజేపీకి సీట్లు రాకున్నా అధికారంలో ఉన్నట్లే. కాకుంటే పొత్తులతో వెళితే ఎప్పటికీ ఎదగలేదు. జనసేన కలసి వస్తే ఓకే. లేకుంటే ఒంటరిగానే వెళ్లడం మంచిదన్న అభిప్రాయంలో కేంద్ర నాయకత్వం ఉంది.
ప్రస్తుతానికి ప్రాంతీయ పార్టీలదే...
కేంద్రంలో ప్రస్తుతానికి బీజేపీకి ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదని భావిస్తున్నారు. మూడో సారి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా బీజేపీకి ఉంది. వరసగా రాష్ట్రాలు గెలుస్తుండటం, కాంగ్రెస్ బలహీనం కావడం తమకు రాజకీయంగా అడ్వాంటేజీ గా మారనుందన్న విశ్వాసంలో ఉంది. అందునా ఆంధ్రప్రదేశ్ లో తమకు, కాంగ్రెస్ కు ప్రస్తుతానికి భవిష్యత్ లేదని తెలుసు. ఏపీలో కాలుమోపడానికి వెయిట్ చేయాల్సిందే. ఏపీలో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయి. ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కు మద్దతివ్వవని తెలుసు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కు మద్దతిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఏపీలో ప్రాంతీయ పార్టీలు భయపడతాయనీ ఎరుకే. అందుకే ఏపీలో ఒంటరిగానే పోటీ చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుంది.
జనసేన వస్తే వచ్చినట్లు...
జనసేన పరిస్థితి వేరు. కలసి వస్తే జనసేనను ముందుపెట్టి కొన్ని స్థానాల్లోనైనా గెలుకుందామనుకుంది. అలా కాకుండా టీడీపీతో కలసి వెళదామనుకుంటే మాత్రం కుదరని చెప్పాలని నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే కుటుంబ పార్టీలకు తాము దూరంగా ఉంటామని పదే పదే ప్రకటిస్తుంది. ఒంటరిగానే బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. అందుకే సోము వీర్రాజు కూడా పొత్తులపై పవన్ కల్యాణ్ నే అడగాలని పదే పదే అంటున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగినా.. సీట్లు ఏవీ రాకున్నా ఫరక్ పడదు. కాకుంటే పార్టీ పరంగా ఓటింగ్ శాతం పెంచుకోవాలన్న లక్ష్యంతోనే బీజేపీ నాయకత్వం ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది.
Next Story