Mon Dec 23 2024 14:16:30 GMT+0000 (Coordinated Universal Time)
రాజుగారి కోసమేనా?.. "హోదా" ఆ ఎన్నిక కోసమేగా?
ప్రత్యేక హోదాపై బీజేపీ మరో నాటకానికి తెరతీసింది. హోదా అంశాన్ని లైవ్ లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదాపై బీజేపీ మరో నాటకానికి తెరతీసింది. ప్రత్యేక హోదా అంశాన్ని లైవ్ లో ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం నరసాపురం ఉప ఎన్నిక అన్నది వాస్తవం. నరసాపురం ఉప ఎన్నిక కోసమే ప్రత్యేక హోదాను బీజేపీ పెద్దలు మరోసారి తెరపైకి తెచ్చారు. అందుకే తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు.
తాజాగా లేఖ రాసి...
ప్రత్యేక హోదా అంశాన్ని తొలి నుంచి తామే ప్రస్తావిస్తూ వస్తున్నామని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఏపీ అధికారులతో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా చర్చించాలని జీవీఎల్ హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు రాసిన లేఖలో కోరారు. ఇప్పుడు బీజేపీ నేతలకు అకస్మాత్తుగా అంత ప్రమే ఎందుకు పుట్టుకొచ్చింది?
నరసాపురం ఉప ఎన్నిక...
బీజేపీ కేంద్రం పెద్దల మనసుల్లోనూ మార్పు రావడం ఒక కారణమయితే మరో కారణం నరసాపురం ఉప ఎన్నిక. నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా రఘురామ కృష్ణరాజు త్వరలో రాజీనామా చేయబోతున్నారు. ఆయన రాజీనామా చేయడం ఖాయం. ఉప ఎన్నిక రావడమూ అనివార్యం. రఘురామ కృష్ణరాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరడం తప్ప మరో మార్గం లేదు. నరసాపురం నుంచి విజయం సాధించాలంటే బీజేపీ, జనసేన కూటమితోనే విజయం సాధ్యమని రఘురామ కృష్ణరాజు నమ్ముతున్నారు.
సాగదీత తప్పదు....
ఆయన బీజేపీలో చేరకముందే ప్రత్యేక హోదాను మళ్లీ తెరపైకి తెచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాను తేవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ప్రత్యేక శ్రద్ధ లేదు. బీజేపీ పెద్దలకు కూడా అది మొన్నటి వరకూ పట్టలేదు. కానీ అకస్మాత్తుగా స్పెషల్ స్టేటస్ అంశం బయటకు రావడానికి నరసాపురం ఉప ఎన్నిక అన్నది ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఉప ఎన్నిక జరిగేలోపు ప్రత్యేక హోదాను కమలనాధులు అనేక మలుపులు తిప్పుతారు. ఉప ఎన్నిక వరకూ హోదాను సాగతీస్తారు. తిప్పి తిప్పి మళ్లీ మొదటికే తెస్తారు తప్ప వాళ్లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కు చేసేదేమీ ఉండదు. ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా మంత్రాన్ని జరిపించడం ఉప ఎన్నిక కోసమేనని చెప్పి తీరాల్సిందే.
Next Story