Sun Dec 22 2024 20:08:56 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బీజేపీ భారీ ఆపరేషన్..! కీలక నేతలతో చర్చలు
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మొన్నటి అమిత్ షా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీజేపీ అధిష్ఠానికి సైతం తెలంగాణపైన నమ్మకం పెరిగింది.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మొన్నటి అమిత్ షా సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీజేపీ అధిష్ఠానికి సైతం తెలంగాణపైన నమ్మకం పెరిగింది. ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు... ప్రజలు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావొచ్చనే భావన బీజేపీలో కలిగింది.
అయితే, ఇప్పటికీ బీజేపీ కొన్ని జిల్లాల్లోనే బలంగా ఉందన్న వాస్తవాన్ని ఆ పార్టీ పెద్దలు గ్రహించారు. కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే పార్టీ బలపడుతోంది. ఇలా కొన్ని జిల్లాల్లో బలపడటం ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి రావడం కుదరని పని అని బీజేపీ పెద్దలు గ్రహించారని తెలుస్తోంది. అందుకే, రాష్ట్రమంతా బలోపేతం కావడానికి భారీ ప్రణాళికను అమలు చేయబోతోంది. ముఖ్యంగా, దక్షిణ తెలంగాణ జిల్లాలపే ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. కీలక నేతలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా పట్టు సాధించేందుకు స్కెచ్ వేసింది.
దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన పలువురు కీలక నేతలతో బీజేపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే భారీ ఎత్తున బీజేపీలో చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా కాంగ్రెస్లోకి వెళ్లాలా ? బీజేపీలోకి వెళ్లాలా ? అనే డైలమాతో ఉన్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైందని సమాచారం. ఇక కాంగ్రెస్లో ఉన్నా లేనట్లే అన్నట్లుగా ప్రవర్తిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీజేపీ చాలా వీక్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ గాలం వేసిందని ప్రచారం జరుగుతోంది. పొంగులేటికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలమైన అనుచరగణం ఉంది. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కక ఇబ్బంది పడుతున్నారు. పొంగులేటిని బీజేపీలోకి చేర్చుకోవడం ద్వారా ఖమ్మం జిల్లాలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో కొందరు బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇంతకాలం ముఖ్యమంత్రి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న మైహోం రామేశ్వరరావును కూడా బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, కొందరు ఇతర పార్టీల నాయకులకు బీజేపీలో చేరాలని ఉన్నా కొత్తగా వెళ్లిన వారికి ఆ పార్టీలో ప్రాధాన్యత ఉండదనే అనుమానాల కారణంగా ఆగిపోతున్నారు. ఈ అనుమానాలను తొలగించడానికి టీఆర్ఎస్లో నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్కు మంచి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా బీజేపీలో చేరితే భవిష్యత్ బాగుంటుందని, ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకాన్ని కల్పించాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు.
Next Story