Wed Jan 15 2025 20:48:58 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను ప్రాబ్లమ్స్ లో పడేయాలనేనా?
జగన్ ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్ధమయినట్లే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు మొండి చేయి ఎదురవుతుంది
జగన్ కు బీజేపీ సహాయ నిరాకరణ చేస్తుందా? అవును. ఈ మధ్య కాలంలో బీజేపీ తమ వైఖరిని మార్చుకున్నట్లే కన్పిస్తుంది. జగన్ ను ఇరుకునపెట్టేందుకు బీజేపీ సిద్ధమయినట్లే అనిపిస్తుంది. అనేక విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు మొండి చేయి ఎదురవుతుంది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే బీజేపీ గేమ్ స్టార్ట్ చేసినట్లు కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి జగన్ ను మరింత బలహీనం చేయాలన్నదే బీజేపీ ఆలోచనగా ఉంది.
వరద సాయాన్ని...
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. దీంతో లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా జగన్ కేంద్ర ప్రభుత్వం పై కొంత ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీ వైపు చూడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంతవరకూ వరద సాయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించలేదు. వరదలతో ఏపీకి దాదాపు ఆరు వేల కోట్ల నష్టం వాటిల్లినా ఇంతవరకూ సాయం ప్రకటించలేదు.
పిల్లిమొగ్గలు....
వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి వెళ్లి దాదాపు వారం రోజులు కావస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయినా భారీగా నష్టం సంభవించిన ఆంధ్రప్రదేశ్ వైపు కేంద్ర ప్రభుత్వం చూడటం లేదు. మరోవైపు విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తున్నట్లే కన్పిస్తుంది. రైల్వేజోన్ తమ పరిశీలనలో లేదని చట్ట సభ సాక్షిగా బయటపెట్టింది.
పోలవరం ప్రాజెక్టుపై....
ఇక పోలవరం నిధులపై కూడా కేంద్రం దొంగాట ఆడుతుంది. సవరించిన అంచనాలతో సంబంధం లేదని చెబుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను మాత్రమే విడుదల చేస్తామని, పునరావాసంతో తమకు సంబంధం లేదని చెబుతోంది. ఇరవై వేల కోట్ల రూపాయల కోత విధించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో జగన్ విఫలమయ్యాడన్న ముద్ర వేయడానికే బీజేపీ ప్రయత్నిస్తునట్లు కనిపిస్తుంది. మరి జగన్ కేంద్ర ప్రభుత్వం తో ఇంకా రాజీ ధోరణిని అవలంబిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story