బాబూ....ముఖ్యమంత్రి నువ్వా..? నేనా..?
తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయుడు... ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదని అడుగుతున్నారని, అసలు ముఖ్యమంత్రి చంద్రబాబా..? నేనా..? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాను పాదయాత్రలో ఉన్నందున ఇప్పటికే పార్టీ నేతలను వారికి అండగా పంపానని ఆయన అన్నారు. మరో 15 రోజుల్లో తుఫాను ప్రభావ ప్రాంతానికి వెళ్లి గ్రామగ్రామాన తిరుగుతానని, 50 రోజుల పాటు అక్కడే ఉంటానని పేర్కొన్నారు. తుఫాను వల్ల నష్టం కలిగిన రూ.3,435 కోట్లను చంద్రబాబు తుఫాను ప్రభావ ప్రాంతానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా సాలూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొన్నారని గుర్తు చేశారు. ఓ వైపు బొబ్బిలి రాజులు ప్రలోభాలకు లొంగి పార్టీ మారితే మరో వైపు గిరిజన ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న దొర తాను అమ్ముడుపోయే వ్యక్తిని కానని చెప్పారని పేర్కొన్నారు. రాజన్న దొరకు ఉన్న వ్యక్తిత్వం బొబ్బిలి రాజులకు లేకుండా పోయిందని ఆరోపించారు.
సముద్రాన్ని కంట్రోల్ చేస్తారంట...
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, ప్రత్యేక హోదాను గాలికొదిలేసి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఓవైపు గిరిజన గూడాల్లో ప్రజలు జ్వరాలతో మరణిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తీత్లీ తుఫానులో కూడా చంద్రబాబు రాజకీయం చేసుకోవాలని చూశారన్నారు. తుఫాను వస్తుందని ముందే తెలిసినా ముఖ్యమంత్రి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా తుఫాను వచ్చాక తీరిగ్గా శ్రీకాకుళం వెళ్లారన్నారు. తమను ఆదుకోవాలని ప్రజలు చంద్రబాబును అడిగితే బుల్డోజర్లతో తొక్కిస్తా అన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకృతిని హ్యాండిల్ చేశానని, సముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హుదూద్ తుఫాను వల్ల 65 వేల కోట్ల నష్టం జరిగితే చంద్రబాబు కేవలం 900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయనే స్వయంగా రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారని గుర్తు చేశారు. పైగా హుదూద్ తుఫానుపై విజయం సాధించానని సంబరాలు చేసుకున్నారని ఆరోపించారు.