Sun Dec 29 2024 01:33:10 GMT+0000 (Coordinated Universal Time)
హుజురాబాద్.. అంతకు మించి.. మునుగోడు
ఓటుకు ముప్ఫయి నుంచి నలభై వేల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి
మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతుంది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటుకు ముప్ఫయి వేల నుంచి నలభై వేల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఒక్క ఓటు వచ్చినా అందుకు డబ్బులు ఖర్చు పెట్టేందుకు రెండు పార్టీలు వెనకాడటం లేదని చెబుతున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ అధిక వ్యయం చేయలేక డీలా పడిపోయిందంటున్నారు.
కాంగ్రెస్ మాత్రం...
మునుగోడు ఉప ఎన్నికలు మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకమే. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో దానిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే బీజేపీ, టీఆర్ఎస్ ల మాదిరి ఖర్చు చేయలేని పరిస్థితి. ఇటు అభ్యర్థి నుంచి అటు పార్టీ వరకూ ఎవరూ ధైర్యంగా ఖర్చు చేయలేని పరిస్థితి. పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. రెండో స్థానం వచ్చినా కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచినట్లే చెప్పుకోవాలి. నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా ఓటు బ్యాంకు తమతో ఉందన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే నోటు కంటే జనాన్ని ఎక్కువగా నమ్ముకుని కాంగ్రెస్ ప్రచారంలోకి దిగుతుంది. కాంగ్రెస్ మాత్రం నామమాత్రంగానే ఖర్చు చేయాలని నిర్ణయించింది.
ఇది గెెలిస్తేనే....
ఇక భారతీయ జనతా పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్స్ గా భావిస్తుంది. ఎలాగైనా ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే చేరికల సంఖ్య కూడా ఎక్కువవుతుందని భావిస్తుంది. ఇప్పటి వరకూ సరైన నేత చేరకపోవడం ఆ పార్టీని కొంత ఇబ్బంది పెడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ముఖ్యనేతలు ఎవరూ బీజేపీ వైపు చూడటం లేదు. ఇంకా అనుమానంగానే చూస్తున్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిస్తే అధికార పార్టీ నుంచి కూడా వలసలు ఉంటాయన్న అంచనాల్లో ఉంది. అందుకే ఎంత ఖర్చయినా ఈ ఎన్నికలలో గెలిచి తీరాలన్న ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. అందుకనుగుణంగా వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు.
ఓటమి పాలయితే...?
అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నిక సవాల్ వంటిది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక. దేశంలో సత్తా చాటాలనుకుంటున్న కేసీఆర్ కు సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవకపోతే అంతకంటే అవమానకరం ఇంకొకటి ఉండదు. అందుకే మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంత ఖర్చయినా పరవాలేదు గెలిచి తీరాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ ఉంది. దీంతో మునుగోడులో డబ్బు, మద్యం ఏరులై పారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో హుజూరాబాద్ అతి ఖరీదైన ఎన్నికగా భావించారు. దానికి మించి ఇక్కడ ఖర్చు చేయడానికి పార్టీలు సిద్ధమయ్యాయన్న టాక్ రాజకీయ నేతలను కలవరపెడుతుంది. భవిష్యత్ లో ఎన్నికలను ఎలా తట్టుకోవాలన్న కామెంట్స్ పొలిటికల్ లీడర్స్ ను కలవర పెడుతున్నాయి.
Next Story