Sat Nov 16 2024 09:59:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రదర్ ఇన్ లా బరి గీస్తున్నాడా?
బ్రదర్ అనిల్ కుమార్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఇటీవల భేటీ కావడం రాజకీయ కారణాలేనని చెప్పక తప్పదు.
గత కొద్ది రోజులుగా బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటనలు చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలగక మానదు. ఆయన తన బావ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. గత ఎన్నికల్లో జగన్ విజయానికి కృషి చేసిన వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ లు ఈసారి రివర్స్ అయినట్లే కనపడుతుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించి తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టారు.
జగన్ ను దెబ్బతీయడానికే....
అయితే ఏపీలోనూ తన అన్న జగన్ ను దెబ్బతీయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని అర్థమవుతుంది. తెలంగాణలో తన పార్టీలో వైసీపీ నేతలు ఎవరూ చేరకుండా అన్న మనుషులే అడ్డుకుంటున్నారని ఆమె సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో తన పార్టీలో కొందరు చేరడానికి సిద్దమయినా వారిని వారించినట్లు షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల నేరుగా రంగంలోకి దిగకుండా తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ ను రంగంలోకి దించినట్లు సమాచారం.
ఉండవల్లిని కలిసి....
బ్రదర్ అనిల్ కుమార్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఇటీవల భేటీ కావడం రాజకీయ కారణాలేనని చెప్పక తప్పదు. ఉండవల్లి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కానీ ఏపీలో జగన్ కు ఇటీవల యాంటీ అయ్యారు. జగన్ పాలన సక్రమంగా లేదని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ మర్యాదపూర్వకంగానే అని చెబుతున్నప్పటికీ జగన్ వ్యవహారశైలి గురించి మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు.
బీసీ, మైనారిటీలతో.....
బద్రర్ అనిల్ అంతటితో ఆగలేదు. వైఎస్ జగన్ పై అసంతృప్తిగా ఉన్న వర్గాలను కలిసే ప్రయత్నం చేస్తున్నాు. వీరిలో ముఖ్యంగా బీసీ, మైనారిటీ నేతలున్నారు. గత ఎన్నికల్లో వీరితో బద్రర్ అనిల్ మాట్లాడి జగన్ కు అండగా నిలబడేలా ప్రయత్నించారు. ఈసారి మాత్రం ఏమీ చెప్పకుండానే బ్రదర్ అనిల్ వెళ్లిపోయారని తెలిసింది. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెళ్లిపోయారని తెలిసింది. ఏపీలో కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని బ్రదర్ అనిల్ చెప్పినప్పటికీ తన బావ జగన్ కు వ్యతిరేకంగా ఒక బ్యాచ్ ను తయారు చేేస్తున్నట్లే కనపడుతుంది.
Next Story