Sat Nov 23 2024 04:15:13 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ vs ఎంఐఎం నిజమేనంటారా?
బీఆర్ఎస్, ఎంఐఎంలు నమ్మకమైన మిత్రులు. గత ఎనిమిదేళ్లుగా కలసే నడుస్తున్నారు. ఒకరి ఇలాకాలో ఒకరు జోక్యం చేసుకోరు.
బీఆర్ఎస్, ఎంఐఎంలు నమ్మకమైన మిత్రులు. గత ఎనిమిదేళ్లుగా కలసే నడుస్తున్నారు. ఒకరి ఇలాకాలో ఒకరు జోక్యం చేసుకోరు. అలాగని ఎన్నికల్లో నేరుగా పొత్తులుండవు. కానీ లోపాయికారీ ఒప్పందాలు ఉంటాయంటారు. చట్టసభల్లో ఎంఐఎం ప్రభుత్వానికి గత ఎనిమిదేళ్లుగా అండగానే నిలుస్తుంది. అన్ని విషయాల్లో మిత్రపక్షంగానే వ్యవహరిస్తుంది. అధికారికంగా మాత్రం మిత్రపక్షం కాదు. పాతబస్తీలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. అలాగే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. కానీ ఒకరికి ఒకరు శత్రువులు కాదు. మిత్రులుగానే వ్యవహరిస్తుంటారు.
మాటల యుద్ధం...
అలాంటిది ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య అసెంబ్లీలో జరిగిన మాటల యుద్ధంపై బయట జోరుగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఎంఐఎం కాంగ్రెస్ తోనే కలసి ఉండేది. అయితే ఆ తర్వాత కేసీఆర్ కు నమ్మకమైన మిత్రుడిగానే కొనసాగుతుంది. ఎంఐఎంను వెనుకేసుకొస్తున్నారని బీజేపీ సయితం అధికార పార్టీపై తరచూ ఆరోపణలు చేస్తుంది. పాతబస్తీలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం తిరుగులేకుండా గెలుస్తూ వస్తుంది. మిగిలిన చోట్ల తాను పోటీ చేయకపోయినా అధికార బీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతిస్తుందంటారు.
యాభై సీట్లలో...
అలాంటి ఎంఐఎం వచ్చే ఎన్నికల్లో యాభై సీట్లలో పోటీ చేస్తామని ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ప్రకటించారు. తమ పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటే తప్పకుండా యాభై చోట్ల అభ్యర్థులను పెడతామని అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఏడుగురు సభ్యులున్న వారికి ఎంత సమయం ఇస్తారంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడంతోనే ఈరకంగానే స్పందించారు. యాభై స్థానాల్లో పోటీ చేసి కనీసం పదిహేను మందిని గెలిపించుకుని వస్తామని అక్బరుద్దీన్ కొంచెం కటువుగానే సమాధానమిచ్చారు. అయితే ఇది ఒకరకంగా బీఆర్ఎస్ కు వార్నింగ్ అనుకోవాలా? లేక ఎన్నికలకు ముందు వ్యూహమా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఊరికేనా...?
మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిలు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించడం వెనక కూడా కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకూ ఎంఐఎంను బీఆర్ఎస్ గౌరవంగా చూసేది. ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తరచూ కేసీఆర్ ను కలసి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తుంటారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగానే ఉంది. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి వెనక కూడా అసద్ ఆలోచన ఉందని చెబుతుంటారు. అయితే బీఆర్ఎస్ సభలకు మాత్రం ఎంఐఎం నేతలు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రెండు పార్టీల మధ్య తేడా వచ్చిందా? డిఫరెన్సెస్ బయటకేనా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- akbaruddin
- ktr
Next Story