Mon Dec 23 2024 14:53:13 GMT+0000 (Coordinated Universal Time)
నాందేడ్లో నిప్పులు చెరిగిన కేసీఆర్
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. జలవివాదాలు ఇంకెన్నాళ్లు అని ఆయన ప్రశ్నించారు
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇంకెన్నాళ్లు అని ఆయన ప్రశ్నించారు. నాందేడ్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో జలయుద్ధం ఇంకా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. మహానది, గోదావరి, కావేరి నీళ్ల కోసం ఇంకా ఎందుకు పంచాయతీ అని నిలదీశారు. అన్ని దేశాలు అభివృద్ధి చెందుతుంటే భారత్ మాత్రం ఇంకా అక్కడే ఉందన్నారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు కావాలని సృష్టించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారన్నారు. ట్రైబ్యునళ్ల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. నాలుగు దశాబ్దాలుగా ట్రైబ్యునళ్లు ఎందుకు సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయన్నారు.
వసతులు లేని చోట...
ఎలాంటి వసతులు లేని సింగపూర్, మలేషియాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని అన్నారు. భారత్ లో ఇంకా గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్తు ఎందుకు సరఫరా కాలేదన్నారు. స్వచ్ఛమైన మంచినీటిని ఎందుకు అందించలేకపోతున్నామన్నారు. సాగునీరు అందక ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు బీడు భూములుగా ఎందుకు మారుతున్నాయో ఆలోచించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది కాని సేవ చేయడం లేదన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసి పేదలను దోచుకుంటూ దోచుకున్నాయని ఫైర్ అయ్యారు.
దేశమంతా ఉచిత విద్యుత్తు...
దేశంలో అపారమైన సహజ సంపద ఉన్నా అది ప్రజలకు మాత్రం చేరువ కావడం లేదన్నారు. కొందరి ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రయివేటు చేసిన సంస్థలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని తెలిపారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చామని, అలాగే దేశమంతా విద్యుత్తు సరఫరాను మెరుగుపరుస్తామని చెప్పారు.
కార్పొరేట్ సంస్థలకు...
కనీసం రైతులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి రైల్వే సదుపాయాన్ని కూడా కల్పించలేని దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు ఏ ఒక్క ప్రయత్నమూ చేయలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే దేశమంతా ఉచిత విద్యుత్తు ఇవ్వవచ్చని అన్నారు. కావాల్సినంత బొగ్గు దేశంలో అందుబాటులో ఉన్నా అదానీకి కట్టబెట్టేందుకు బొగ్గు కొరతను సృష్టించారన్నారు. విద్యుత్తును కూడా కార్పొరేటర్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దేశంలోని మేధావులందరితో సమావేశమై వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నానని తెలపారు.
Next Story