Mon Dec 23 2024 03:13:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీపై కేసీఆర్ ఫోకస్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించినట్లుంది. అక్కడ నేతల చేరికలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పై దృష్టి సారించినట్లుంది. అక్కడ నేతల చేరికలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పొరుగు రాష్ట్రాన్ని కేసీఆర్ టార్గెట్ చేశారు. పక్క రాష్ట్రం నుంచే చేరికలు లేకపోతే దేశ స్థాయిలో బీఆర్ఎస్ పరువు నిలబడదనుకున్నారో? ఏమో? ఏపీలో చేరికలపై ఫోకస్ పెంచారు. వివిధ పార్టీల్లో అసంతృప్త నేతలతో ఆయన నేరుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. వారికి కొంత హామీలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ లో చేరికలు మొదలయ్యాయి. కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
పరిచయం ఉన్న నేతలతో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తనకు పరిచయం ఉన్న నేతలతో కేసీఆర్ టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏపీలో జరగనున్న ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ను పోటీ చేయించాని భావిస్తున్నారు. కేవలం నామమాత్రం పోటీ కాకుండా అత్యధిక ఓట్లను సాధించి రాజకీయ పార్టీలకు సవాల్ విసరాలన్న లక్ష్యంతో ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఏపీ బీఆర్ఎస్ వ్యవహరాలను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కు అప్పగించిన కేసీఆర్ తాను దగ్గరుండి మానటరింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడిగా...
తోట చంద్రశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. జనసేనలో కీలక సభ్యుడు. రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా తోట చంద్రశేఖర్ ఉన్నారు. ఆయనను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా చేసి కాపు సామాజికవర్గం ఓట్లపై కేసీఆర్ కన్నేసినట్లు కనపడుతుంది. త్వరలోనే ఏపీలో రెండు మూడు చోట్ల కేసీఆర్ సభలను కూడా నిర్వహింాచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తోట చంద్రశేఖర్ కు రేపు కేసీఆర్ కండువా కప్పనున్నారు. ఆయనను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ భావిస్తున్నారు.
పార్టీలోకి మాజీ మంత్రి....
ఇక మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రేపు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆయన తొలుత టీడీపీ తర్వాత జనసేన అటునుంచి బీజేపీలో చేరారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికై 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఆయన దళితుడు కావడంతో ఆయనను ఎంపిక చేశారని తెలిసింది. కేసీఆర్ సమక్షంలో ఆయన రేపు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరికొందరు నేతలు కూడా కేసీఆర్ కు టచ్ లో ఉన్నట్లు తెలిసింది. ఏపీలో తనకు పరిచయమున్న నేతలను వరసగా చేర్చుకుంటూ పార్టీకి హైప్ తేవాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది.
- Tags
- kcr
- andhra prades
Next Story