Mon Jan 06 2025 12:28:52 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఉగాది : ఈరోజు ఎన్ని గంటలు?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికి మూడు సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికి మూడు సార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తొలిసారి ఎనిమిది గంటలు, రెండోసారి పదిగంటల విచారణను ఎదుర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఒకసారి హాజరై ఎనిమిది గంటల పాటు విచారణ ఎదుర్కొన్న కవిత ఇరవై తేదీన మాత్రం కొంత ఎక్కువ సేపు ఈడీ కార్యాలయంలో ఉన్నారు. ఈరోజు కూడా విచారణకు హాజరు కావడంతో ఈడీ అధికారులు ఆమెను ఎన్ని గంటలు విచారిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మంత్రులంతా...
బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాసగౌడ్ లు ఢిల్లీలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. న్యాయనిపుణులతో వాళ్లు సంప్రదింపులు జరుపుతూ కవితకు అవసరమైన న్యాయసలహాలు అందిస్తున్నారు. కవితకు ధైర్యం చెప్పడానికి, ఆమెకు చేదోడువాదోడుగా ఉండటానికి కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు కవిత భర్త ఢిల్లీలోనే ఉన్నారు. వీరితో పాటు జాగృతి సంస్థ, బీఆర్ఎస్ కు చెందని ముఖ్యకార్యకర్తలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
ఉత్కంఠ నెలకొన్నా...
నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొంత టెన్షన్ కనిపించింది. కవిత ఈడీ కార్యాలయం నుంచి రావడం ఆలస్యం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే 9.15 గంటలకు ఆమె బయటకు రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మరి ఈరోజు విచారణ ఎంతసేపు జరగనుందన్నది తెలియాల్సి ఉంది. కవితను మరోసారి విచారణకు ఈడీ అధికారులు పిలుస్తారా? లేక ఈరోజుతో విచారణ పూర్తవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. రేపు ఉగాది పండగ కావడంతో విచారణ లేకుండా పంపితే బాగుండునని పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story