Mon Dec 23 2024 11:40:06 GMT+0000 (Coordinated Universal Time)
ఇక అక్కడికేనా?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది
గత కొద్ది రోజులుగా అసమ్మతితో బహిరంగ కామెంట్స్ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. వేచి చూసి చూసి వేటు వేసింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసమే ఈ రగడ అని భావించిన పార్టీ అధినాయకత్వం ముందుగానే చర్యలు తీసుకుంది. వారి విమర్శలకు పెద్దగా పస లేకుండా చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే సస్పెన్షన్ వేటు వేసింది. అయితే బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత వారు రిలీఫ్ ఫీలవుతున్నట్లు ప్రకటించారు. తమకు పంజరం నుంచి విముక్తి లభించిదని చెప్పారు. ఇకపై తాము బీఆర్ఎస్ పై పోరుబాట చేస్తామని హెచ్చరించారు.
కొంతకాలంగా...
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా బీఆఆర్ఎస్ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచిన తర్వాత అప్పటి టీఆర్ఎస్లో చేరారు. 2019 ఎన్నికల్లో ఎంపీ టిక్కెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. 2018 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క సీటు మాత్రమే గెలుచుకోవడం, కాంగ్రెస్ అధిక స్థానాలను సాధించుకోవడంతో బీఆర్ఎస్ హైకమాండ్ పొంగులేటిపై గుర్రుగా ఉంది. అందుకే ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదంటారు. ఇక రాజ్యసభ సీటు కూడా వస్తుందని ప్రచారం జరిగినా ఆ ఆలోచనే కేసీఆర్ చేయలేదు. తన అనుచరవర్గానికి కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని భావించిన పొంగులేటి తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఆత్మీయ సదస్సుల పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను చుట్టి వస్తున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
బీజీపీ ఆహ్వానం...
కానీ ఆయన ఏ పార్టీలో చేరతారన్నది స్పష్టత లేదు. బీజేపీ పెద్దలు పొంగులేటితో ఇప్పటికే టచ్‌లో ఉన్నారని తెలిసింది. ఆయన వస్తే కోరిన నియోజకవర్గాల టిక్కెట్లు గ్యారంటీ అని భరోసా ఇస్తుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో బీజేపీ వీక్ గా ఉండటంతో పొంగులేటి రాకను కోరుకుంటుంది. బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సయితం ఆయనతో ఫోన్లో ఇప్పటికే మాట్లాడారని చెబుతున్నారు. పొంగులేటి కుమారుడి పెళ్లి రిసెప్షన్ వేడుకకు బీఆర్ఎస్ నేతలకంటే బీజేపీ నేతలే ఎక్కువగా హాజరవ్వడంతో ఈ ప్రచారానికి ఊపందుకుంది. అయితే ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో కాంగ్రెస్‌లో చేరతారన్న టాక్ కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే ఆయనతో భేటీ అవుతారని సమచారం. పొంగులేటి కోరుకున్న సీట్లు కాకపోయినా కొన్ని సీట్లు ఆయనకు ఇచ్చేలా ప్రతిపాదనను హైకమాండ్‌కు పంపుతామని చెబుతున్నారు. మరి పొంగులేటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ నేతలతో టచ్‌లో...
ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కూడా దాదాపు అదేపరిస్థితి. ఆయన గత ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపొందారు. అయితే ఆయనను బీఆర్ఎస్ లాగేసుకోవడంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా ఆత్మీయ సదస్సులతో జిల్లా అంతటా పర్యటిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై సవాళ్లు విసురుతున్నారు. కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో తన అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపి గెలిపించుకున్నారు. దీంతో జూపల్లిని కూడా బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో ఇప్పటికే జిల్లా బీజేపీ నేత డీకే అరుణ మాట్లాడారని చెబుతున్నారు. ఆలోచించి చెబుతానని మాట ఇచ్చారంటున్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. ఇద్దరు సామాజికవర్గం పరంగా, ఆర్థికంగా బలమైన నేతలే కావడంతో ఏ పార్టీలో చేరతారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story