మరోసారి ఆ... పరిశ్రమలో సంక్షోభం ...?
నిరుద్యోగులకు కల్పవృక్షం గా మారి లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పించిన కేబుల్ పరిశ్రమలో సంక్షోభం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ ద్వారా అమలు చేయనున్న కొత్త నిబంధనలు కేబుల్ నిర్వాహకులను నష్టాలబాటలో పడవేయనున్నాయి. సరికొత్త నిబంధనల ప్రకారం ఛానెల్ కి 19 రూపాయల చొప్పున వినియోగదారుడి నుంచి ఆపరేటర్ వసూలు చేయాలిసివుంటుంది. అలా చేస్తే ఐదు వందల రూపాయల నుంచి ఆరువందల రూపాయలు ఒక్కో వినియోగదారుడి నుంచి వసూలు చేయాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలనుంచి మెట్రో సిటీస్ వరకు 150 రూపాయలనుంచి 300 వందల రూపాయలను కేబుల్ కనెక్షన్ కి నెలవారీ వసూలు చేస్తున్నారు ఆపరేటర్లు. తాజా నిబంధనలు అమల్లో పెడితే దీనికి రెట్టింపు ఛార్జ్ చేయాలిసి వస్తుంది. దీంతో వినియోగదారులు అంతమొత్తాన్ని భరించలేక ప్రత్యామ్నాయంగా డిటిహెచ్ వంటి వాటికి మారే అవకాశాలు స్ఫష్టం.
ఇప్పటికే నష్టాలు ....
ఇప్పటికే కేబుల్ వ్యవస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మార్పులు చేసుకోక తప్పని పరిస్థితిలో కోట్లాది రూపాయలను వెచ్చించి వినియోగదారులకు సేవలు అందిస్తుంది. దీనికి తోడు క్రికెట్ వంటి స్పోర్ట్స్ ప్రసారాలు అందించే ఛానెల్స్ ఏ ఏడాదికి ఆ ఏడాది తమకు చెల్లించాలిసిన మొత్తాన్ని పెంచుతూ పోతున్నాయి. దాంతో చిన్నపాటి ఎం ఎస్ ఓ లు నష్టాల బాట పట్టక తప్పడం లేదు. డిటిహెచ్ ప్రసారాలకు ధీటుగా ఫైబర్ ఆప్టికల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేబుల్ పరిశ్రమ కోట్ల రూపాయలను సెట్ టాప్ బాక్స్ ల రూపం లో వెచ్చించి వినియోగదారులపై అధిక భారాన్ని మోపక తప్పలేదు. ఏడాదికేడాది మారుతున్న ట్రాయ్ నిబంధనల ఫలితంగా మరింత నష్టాలను కేబుల్ పరిశ్రమ చవిచూస్తోంది. దాంతో అటు ఎంఎస్ఓ లు ఇటు క్షేత్ర స్థాయిలోని ఆపరేటర్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
దూసుకొస్తున్న కార్పొరేట్ లు ...
మరోపక్క వ్యాపారంలో పోటీ కూడా అధికమైంది. ఎపి ఫైబర్ నెట్ వంటి సంస్థలు ప్రభుత్వ భాగస్వామ్యంతో కనెక్షన్లు బలవంతంగా వేసుకుంటూ పోవడంతో కేబుల్ ఆపరేటర్లు ఇప్పటికే సమస్యల సుడిగుండంలో పడ్డారు. వీటికి తోడు రిలయన్స్, ఎయిర్ టెల్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు కేబుల్ రంగంలోకి అడుగుపెట్టేందుకు అవసరమైన అన్ని హంగులు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ బడా సంస్థలకు లబ్ది చేకూర్చేలా ట్రాయ్ ద్వారా ప్రభుత్వం ఇప్పటినుంచి కేబుల్ ఇండస్ట్రీ ని దశలవారీగా దెబ్బ తీసేందుకు సిద్ధం అవుతుందన్న విమర్శలు, ఆరోపణలు ఎం ఎస్ ఓ లు, ఆపరేటర్లు చేస్తున్నారు.
పోరాటానికి సిద్ధం అవుతున్న ...
మూడు నెలలు వినియోగదారులు తమకు సహకరించాలని, ట్రాయ్ విధించిన ధరలు నేలకు దిగివచ్చేలా పోరాటం చేస్తామని అంటున్నాయి కేబుల్ పరిశ్రమ వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిశ్రమ పై ఆధారపడిన వారంతా హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమానికి సిద్ధం అయ్యారు. తమ సమస్యపై కేంద్ర మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో వారు దశలవారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ముందుగా హైదరాబాద్ లో ఈనెల 27 ధర్నా, 29 న ట్రాయి కొత్త నిబంధనలు తొలగించాలని కోరుతూ ఒకరోజు మొత్తం ఛానెల్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎం ఎస్ ఓ ల సంఘం నిర్ణయించింది. మరి కేంద్రం ఈ పోరాటానికి దిగివస్తుందా కార్పొరేట్ శక్తులకు కేబుల్ పరిశ్రమ అప్పగిస్తుందా అన్నది చూడాలి